
క్రాఫ్ట్ హీన్జ్ సంస్థకు చెందిన కాంప్లాన్ బ్రాండ్ విక్రయం వేడెక్కుతోంది. దీని కొనుగోలు కోసం పోటీ పడుతున్న వారిలో దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలతో పాటు అగ్రశ్రేణి ప్రైవేటు ఈక్విటీ సంస్థలూ ఉన్నాయి. కాంప్లాన్‌తో పాటు గ్లూకోన్–డి, నైసిల్, సంప్రితి ఘీ బ్రాండ్లతో కూడిన కన్సూమర్ ఫుడ్ డివిజన్‌ను వంద కోట్ల డాలర్లకు విక్రయించాలనేది క్రాఫ్ట్ హెన్జ్ కంపెనీ ఆలోచన. ఈ విభాగం విక్రయ వ్యవహారాలను చూడటానికి జేపీ మోర్గాన్, లజార్డ్ సంస్థలను ఈ కంపెనీ నియమించింది కూడా.
కాంప్లాన్ వంటివి బాగా పాతుకుపోయిన బ్రాండ్లు కావటంతో ఐటీసీ, ఇమామి, విప్రో, అబాట్, జైడస్ వెల్‌నెస్, క్యాడిలా వంటి కంపెనీలతో పాటు బ్లాక్‌స్టోన్, కార్లైల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వచ్చే నెల 15లోగా తమ తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీల బిడ్లు 70–80 కోట్ల డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సమాచారం. మరోవైపు గ్లాక్సో స్మిత్‌క్లైన్ కంపెనీ కూడా తన కన్సూమర్ హెల్త్‌కేర్ వ్యాపారాన్ని (దీంట్లో హార్లిక్స్ బ్రాండ్ కూడా ఉంది) విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. హార్లిక్స్‌ను అమ్మనున్నట్లు జీఎస్‌కే ప్రకటించిన కొద్ది రోజులకే క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కూడా కాంప్లాన్ బ్రాండ్‌ను అమ్మకానికి పెట్టడం విశేషం.
కాంప్లాన్.. 8 శాతం మార్కెట్ వాటా!
మూడేళ్ల కిందట 2015లో క్రాఫ్ట్ ఫుడ్స్, హీన్జ్ కంపెనీలు రెండూ విలీనమై క్రాప్ట్ హెన్జ్ సంస్థ ఏర్పడింది. ఈ కంపెనీ 13 విభిన్న రకాలైన బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తోంది. ఈ కంపెనీ కన్సూమర్ బిజినెస్ 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1,800 కోట్ల అమ్మకాలు సాధించింది. దీంట్లో ఒక్క కాంప్లాన్ వాటాయే 40 శాతంగా ఉంటుంది. ఈ కాంప్లాన్ బ్రాండ్‌ను 1994లో హీన్జ్ కంపెనీ గ్లాక్సో నుంచి కొనుగోలు చేసింది.
మాల్టెడ్ ఫుడ్ డ్రింక్‌లో (ఎమ్‌ఎఫ్‌డీ) కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుంది. భారత్‌లో ఎమ్‌ఎఫ్‌డీ పరిశ్రమ రూ.8,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంట్లో 44.3 శాతం మార్కెట్ వాటాతో గ్లాక్సో కంపెనీకి చెందిన హార్లిక్స్‌దే అగ్రస్థానం. ఈ కంపెనీకే చెందిన బూస్ట్, మాల్టోవా కూడా మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. క్రాఫ్ట్ కంపెనీకి చెందిన బోర్నవిటా, నెస్లే మిలో తదితర బ్రాండ్‌లు కూడా మంచి అమ్మకాలే సాధిస్తున్నాయి.
వైదొలుగుతున్న ఎమ్‌ఎన్‌సీలు...
మాల్టెడ్ ఫుడ్ డ్రింక్ (ఎమ్‌ఎఫ్‌డీ) కేటగిరీ వృద్ధి ఆశించినంత జోరుగా లేకపోవటం, పోటీ తీవ్రత పెరుగుతుండటంతో ఈ రంగం నుంచి వైదొలగాలని బహుళ జాతి కంపెనీలు భావిస్తున్నాయి. మాల్ట్ బేస్‌డ్ డ్రింక్స్ విభాగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2014లో 13 శాతంగా ఉన్న ఈ పరిశ్రమ వృద్ది 2017లో 9 శాతానికే పరిమితమైంది. అయితే వాండర్ ఏజీ కంపెనీ ఓవల్టీన్, క్యాడిలాకు చెందిన ఆక్టిలైఫ్ వంటి సప్లిమెంట్ న్యూట్రిషన్ డ్రింక్స్ వీటికన్నా మంచి వృద్ధిని సాధించాయి.
అలాగని ఈ డ్రింక్స్ వృద్ధి కూడా మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. ఈ డ్రింక్‌ల సెగ్మెంట్ వృద్ధి 2014లో 21.3 శాతంగా ఉండగా, 2017లో 11.5 శాతానికే పరిమితమయింది. 2017లో క్రాఫ్ట్ హీన్జ్‌కు న్యూట్రిషినల్ బేవరేజేస్ వ్యాపారంలో 5 కోట్ల డాలర్ల ఇంపెయిర్‌మెంట్ నష్టాలు (భవిష్యత్తు విలువ క్షీణించటం) వచ్చాయి. వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటం, ఇంపెయిర్‌మెంట్ నష్టాల వంటి కారణాల వల్ల క్రాఫ్ట్ హీన్జ్ కంపెనీ కాంప్లాన్, ఇతర బ్రాండ్లను అమ్మకానికి పెట్టింది.
కాగా బ్లాక్‌స్టోన్, కార్లైల్ వంటి పీఈ సంస్థలు కన్సూమర్ హెల్త్‌కేర్ థీమ్‌పై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలు వదిలించుకోవాలనుకుంటున్న ఈ సెగ్మెంట్ బ్రాండ్ల కొనుగోలుకు ఇవి పోటీ పడుతూ బిడ్లు వేస్తున్నాయి. కాకపోతే అధికారికంగా మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు. ఆదాయ స్థాయిలు పెరుగుతుండటంతో వినియోగదారులు బ్రాండెడ్ ఉత్పత్తులకే ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో వచ్చే 20 ఏళ్లలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
కాంప్లాన్ కథ
గ్లాక్సో కంపెనీ కాంప్లాన్‌ను పౌడర్ రూపంలో ఉన్న మిల్క్ ఎనర్జీ డ్రింక్‌గా 1954లో మార్కెట్లోకి తెచ్చింది. ఇంగ్లాండ్‌లో ఈ బ్రాండ్‌ను గ్లాక్సో కంపెనీ 1988లోనే వేరే కంపెనీకి అమ్మేసింది. భారత్‌లో మాత్రం 1994లో క్రాఫ్ట్ కంపెనీకి విక్రయించింది. మాల్టెట్ ఫుడ్ డ్రింక్ మార్కెట్లో కాంప్లాన్ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంటుందని అంచనా.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, క్రాఫ్ట్ అండ్ హెన్జ్ కంపెనీ ఐదవ అతి పెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ. కాప్రి సన్, క్లాసికో, జెల్–ఓ, కూల్–ఎయిడ్, లంచబుల్స్, మ్యాక్స్‌వెల్... ఇవి ఈ కంపెనీ పాపులర్ బ్రాండ్లలో కొన్ని. షికాగో, పిట్స్‌బర్గ్ కేంద్రాలుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో నియంత్రిత వాటాలు ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, 3జీ క్యాపిటల్‌కు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment