బెంట్లీ తొలి ఎస్యూవీ ‘బెంటేగ’
ధర రూ.3.85 కోట్లు
న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇప్పటికే బెంటేగ బుకింగ్స్‌ను తీసుకున్నాం. తొలి డెలివరీ 2 వారాల్లో జరుగుతుందని’ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా తెలిపారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 5-6 నెలల కాలంలో కారును డెలివరీ చేస్తామని పేర్కొన్నారు.
ఎస్‌యూవీ ప్రత్యేకతలు: ‘బెంటేగ’లో ట్విన్ టర్బో చార్జ్‌డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, వాయిస్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్‌యూవీ అని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు.
హైదరాబాద్‌లో కొత్త షోరూమ్
హైదరాబాద్‌లో కొత్తగా బెంట్లీ షోరూమ్‌ను నిర్మిస్తున్నామని బంగ్లా తెలిపారు. దీన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూమ్‌లో సర్వీస్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు.