14నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం
14నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం
Published Fri, Jul 14 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
న్యూఢిల్లీ : కూరగాయలు, పప్పులు, దుంపలు ధరలు జూన్ నెలలో భారీగా తగ్గాయి. దీంతో టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 14నెలల కనిష్టానికి పడిపోయింది. మే నెలలో 2.17 శాతంగా నమోదైన ఈ ద్రవ్యోల్బణం, జూన్ నెలలో 0.9 శాతానికి ఢమేల్‌మంది. గతేడాది జూన్‌లో కూడా ఈ ద్రవ్యోల్బణం 0.09 శాతానికి పడిపోయిన విషయం విదితమే. ఆహార ద్రవ్యోల్బణం 3.47 శాతం పడిపోయింది. పప్పులు, కూరగాయలు, దుంపల ధరలు ఎక్కువగా క్షీణించడంతో ఈ ద్రవ్యోల్బణం కిందకి పడిపోవడానికి సహకరించింది. ఇదే సమయంలో గుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 1.92 శాతానికి పెరిగింది.
కాగ, మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 1.02 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. మే నెలతో పోలిస్తే, జూన్ నెలలో ఇంధనం, విద్యుత్ ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా 5.28 శాతానికి పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో తయారీ ఉత్పత్తులు 64.23 శాతం వెయిటేజీని కలిగి ఉంటాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రమే కాక, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయింది. దీంతో వచ్చే నెల ప్రారంభంలో జరుగబోయే ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రేట్ల కోతను చేపడతారని ఆశలు పెరుగుతున్నాయి.
Advertisement