
ముంబై: ప్రీపెయిడ్ వ్యాలెట్లు (పేటీఎం, మొబిక్విక్, ఓలా మనీ, అమెజాన్ పే తరహా) తమ కస్టమర్లకు సంబంధించిన కేవైసీ వివరాలు ధ్రువీకరించేందుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28గానే ఉంటుందని, దీన్ని పొడిగించేది లేదని ఆర్‌బీఐ సోమవారం స్పష్టం చేసింది. ‘‘కేవైసీ మార్గదర్శకాల అమలుకు కావాల్సినంత వ్యవధి ఇచ్చాం. గడువులోపు కేవైసీకి సంబంధించిన వివరాలు సమర్పించని కస్టమర్లు ఆందోళన చెందక్కర్లేదు. వ్యాలెట్లలో ఉన్న బ్యాలన్స్‌ను సరుకుల కొనుగోలుకు, సేవలకు వినియోగించుకోవచ్చు.
వ్యాలెట్ తిరిగి రీచార్జ్ చేసుకోవాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి’’ అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో స్పష్టంచేశారు. లావాదేవీల భద్రతా, కస్టమర్ల రక్షణ కోసమే ఈ నిబంధన అమలు చేస్తున్నట్టు కనుంగో చెప్పారు. బ్యాంకులు ప్రమోట్ చేసిన 50 వ్యాలెట్లతోపాటు నాన్ బ్యాంకింగ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లు 55 వరకు ప్రస్తుతం మనదేశంలో ఉన్నాయి. కేవైసీ నిబంధనలు అమలు చేసేందుకు ఈ సంస్థలకు గతేడాది డిసెంబర్ 31 వరకు తొలుత గడువు ఇచ్చారు.
తర్వాత దీన్ని ఈ నెల 28కి పొడిగించారు. నిజానికి ఈ నిబంధన వ్యాలెట్ సంస్థలను కలవరపరిచేదే. ఎందుకంటే 90 శాతం కస్టమర్లు కేవలం ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలతోనే వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మొబైల్ ఫోన్లకు కేవైసీ అమలు చేస్తున్నందున దాన్నే పరిగణనలోకి తీసుకుంటే పోతుందిగా అన్నది ప్రీపెయిడ్ పేమెంట్ వ్యాలెట్ల పరిశ్రమ అభిప్రాయం.