వైజాగ్ స్టీల్ ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ - ఆర్‌ఐఎన్‌ఎల్ (వైజాగ్ స్టీల్) ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను వైజాగ్ స్టీల్ సెప్టెంబర్‌లో సమర్పించింది. దీనికి ఈ నెల 22న సెబీ తుది క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతిపాదిత ఐపీవో కింద 48,89,84,620 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనుంది. ఇందులో 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు, 50 శాతం అర్హత పొందిన సంస్థాగత ఇన్వెస్టర్లకు ఉద్దేశించారు.
రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ధరపై అయిదు శాతం దాకా డిస్కౌంటు లభిస్తుంది. వైజాగ్ స్టీల్ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రభుత్వం 10 శాతం వాటాలు విక్రయించనుంది. యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, డాయిష్ ఈక్విటీస్ (ఇండియా) ఈ ఇష్యూని నిర్వహిస్తాయి. వాస్తవానికి 2014-15లోనే ఐపీవో రావాల్సి ఉన్నప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. ఇటీవలి హుద్‌హుద్ తుపాను తాకిడితో వాటిల్లిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఐపీవో తేదీలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అధికారి ఒకరు తెలిపారు. హుద్‌హుద్ తుపాను తాకిడి కారణంగా వైజాగ్ స్టీల్ లాభదాయకత రూ. 350 కోట్ల మేర దెబ్బ తిని ఉంటుందని ప్రాథమిక అంచనా.