
బలూచిస్థాన్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. 26మంది సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. లస్బెలా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి పంజ్‌గుర్ వెళ్తున్న ఓ బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి దూకేందుకు యత్నించారు. అయితే అప్పటికే రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదంలో 26 మంది సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో గుర్తుపట్టని రీతిలో శరీరాలు కాలిపోయాయని తెలిపారు.