ఆప్ ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
‘నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు’ అని వారు వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు ఎల్జీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సీఓం కేజ్రీవాల్ నివాసంలో ఇంటింటికి సేవలు పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ అన్షు ప్రకాశ్, కొందరు ఉన్నతాధికారులు, ఆప్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశం కొనసాగుతుండగా ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది.
ఇంతలో ఎమ్మెల్యే అమనాతుల్లా ఆగ్రహంతో ఊగిపోతూ అన్షు చెంప చెల్లుమనిపించారు. ఆపై దుర్భాషలాడుతుండగా.. అధికారులు ఎమ్మెల్యేని అదుపు చేశారు. దాడిలో మరో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కేజ్రీవాల్ సమక్షంలోనే చోటు చేసుకోవటం విశేషం. కాగా, అమనాతుల్లా కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు.
మరోవైపు ఎల్జీని కలిసిన అనంరతం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసోషియేషన్ ఈ మధ్యాహ్నం భేటీ కానుంది. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే విషయం.. తదుపరి చర్యలపై వారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే తెలుస్తుంది
కాగా, సీఎస్‌పై దాడి జరిగిందన్న వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆయనపై ఎమ్మెల్యేలెవరూ దాడి చేయలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో అన్షునే ఎమ్మెల్యేలను దుర్భాషలాడారని.. తాను కేవలం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే జవాబుదారీనంటూ సీఎస్ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఇక బీజేపీ విమర్శలకు ఆప్ స్పందించింది. సీఎస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడని.. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అన్షు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వల్, సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment