అబుదాబి : యూఏఈకి చెందిన ఓ మహిళ తన ప్రియున్ని చంపడమే కాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తిమీద పగ తీర్చుకోవాలని భావించిన మహిళ అతన్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు మహిళే కోర్టు విచారణలో తెలిపిందని ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది.
నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత మహిళను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్‌ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment