
ఏసీబీ అధికారులకు పట్టుబడిన జగదీశ్వర్
రాజేంద్రనగర్: ఫంక్షన్ హాల్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ. 9 వేలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న సబార్డినేటర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. శివరాంపల్లి ప్రాంతానికి చెందిన నైజర్ ఫంక్షన్ హాల్‌కు జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ రూ.50 వేలు వసూలు చేస్తోంది. దాని యజమాని చెక్కులను జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సకాలంలో ఇచ్చినా మరుసటి నెలలో వాటిని డిపాజిట్ చేయడంతో జరిమానా కలిపి రూ.75 వేలు వచ్చింది. దీంతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు మహ్మద్ అక్తార్ ఆన్‌లైన్‌లో ట్రేడ్ లైసెన్స్ డబ్బును చెల్లించగా మరోమారు చెల్లించాలని రాజేంద్రనగర్ సర్కిల్ సబార్డినేటర్ ఎస్.జగదీశ్వర్ నాలుగు రోజులుగా అతడిని వేధించసాగాడు.
తాను ఆన్‌లైన్‌లో చెల్లించానని చెప్పినా జగదీశ్వర్ వినిపించుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో చెల్లించినా కూడా తనకు రూ.10 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేయసాగాడు. గతంలో అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతోనే చెక్కును తర్వాతి నెల చెల్లించి రూ.25 వేల అపరాధ రుసుం వచ్చేలా జగదీశ్వర్ చేశాడు. దీంతో అక్తార్ రూ.9 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. సోమవారం ఉదయం గగన్‌పహాడ్‌లోని కార్యాలయానికి రావాలని జగదీశ్వర్ అతడికి సూచించాడు. ఈ విషయమై అక్తార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలో అక్తార్ జగదీశ్వర్‌కు రూ.9 వేలు ఇస్తుండగా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సీఐలు గంగాధర్, మాజిద్‌ఖాన్, రాంలింగారెడ్డి, నాగేందర్‌బాబు రంగప్రవేశం చేసి రెడ్‌హ్యాండెండ్‌గా అతడిని పట్టుకున్నారు. అయితే, సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్ల ట్రేడ్ లైసెన్స్‌లను ఆఫీస్ బాయ్ అయిన జగదీశ్వర్ జారీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. వాస్తవంగా ఏఎంహెచ్‌ఓతో పాటు శానిటరీ సూపర్‌వైజర్ పర్యవేక్షణలో ఈ లైసెన్స్ ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. ఆఫీస్‌బాయ్ చేత ఈ ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.