
చెన్నై, పెరంబూరు: తండ్రి విజయకుమార్ ఫిర్యాదు మేరకు ఆయన కూతురు, నటి వనితను శుక్రవారం మధురవాయిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీనియర్ నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని ఆయన షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. అలా విజయకుమార్ కూతురు, నటి వనిత ఆ మధ్య షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరి.. తరువాత ఆ ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో విజయకుమార్ వనితను ఇల్లు కాళీ చేయించాలని మధురవాయిల్ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు. అయితే వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి పరారైంది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెను ఇంట్లో ఉండడాన్ని ఎవరూ అడ్డుకోరాదని, అవసరమైతే పోలీసులు వనితకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనిత గురువారం విజయకుమార్ ఇంట్లో చేరింది. శుక్రవారం నటుడు విజయకుమార్ మళ్లీ మధురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఆమెను తన ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment