నిరుద్యోగులను మోసగించి పరారైన జోగి శ్రీనివాసరావు, మధ్యవర్తి పంపన దుర్గా ప్రసాద్
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ స్థాయిలో సొమ్ములు వసూలు చేసి ఓ మోసగాడు పరారైన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. బాధితుల కథనంప్రకారం.. రాజోలు మండలం మలికిపల్లి గ్రామానికి చెందిన జోగి శ్రీనివాసరావు అనే వ్యక్తి జిల్లాలో అనేక మందితోపాటు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులను వలలో వేసుకొని వారికి మాయమాటలు చెప్పి కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మోసపోయిన వారు సుమారు 50 మంది వరకు ఉంటారని, రూ.1.80 కోట్లమేర స్వాహా చేసి నిందితుడు ఉడాయించాడని బాధితులు లాలాచెరువుకు చెందిన ఎం.శివ ప్రసాద్, కాతేరు గ్రామానికి చెందిన టి.హేమల రావు, నక్కా జయరాజు, కాకుల పాటి వీరేష్ కుమార్ తెలిపారు.
మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు ఎర
ఈ వ్యవహారంలో మధ్యవర్తులు పంపన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నిరుద్యోగులకు ఎరవేసి జోగి శ్రీనివాసరావు రెండో భార్య అయిన ఆళ్లపు మంగ అకౌంట్‌లో నిరుద్యోగుల నుంచి నగదు వేయించుకుని మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి అపాయింట్‌మెంట్ ఆర్డర్ వస్తుందని నమ్మించి అనంతరం కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. నిందితుడు హైదరాబాద్‌కు పరారైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment