పట్ట పగలే బార్‌లో గొడవ | Alcohol Fighting in Bar in Hyderabad | Sakshi
Sakshi News home page

పట్ట పగలే బార్‌లో గొడవ

Published Wed, Jun 26 2019 7:43 AM | Last Updated on Wed, Jun 26 2019 7:43 AM

Alcohol Fighting in Bar in Hyderabad - Sakshi

సాయిప్రసాద్‌ (ఫైల్‌)

ఉప్పల్‌:  పట్ట పగలే ఓ బారులో కొందరు యువకులు  మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకోగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన  ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి బాబు కథనం మేరకు వివరాల ఇలా ఉన్నాయి. చిలుకానగర్‌ర్‌లోని న్యూరామ్‌నగర్‌కు చెందిన సింగిశెట్టి శ్రీకాంత్, సింగిశెట్టి ఉదయశంకర్‌ సోదరులు. ఇటీవల వీరి తల్లి మృతి చెందింది. అదివారం ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి సాయినగర్‌కు చెందిన తన మేనమామ  మెరుగు లక్ష్మణ్‌ కూడా పిలిచారు. అయితే గత 15 ఏళ్లుగా వీరికి మాటలు లేవు. సోమవారం ఉదయం కార్యక్రమం ముగిసిన అనంతరం లక్ష్మణ్‌ తనను ఇంటికి తీసుకెళ్లేందుకు తన కుమారుడు మెరుగు సాయిప్రసాద్‌(28)ను అక్కడికి రప్పించారు.

మధ్యాహ్నం ముగ్గురు కలిసి మద్యం తాగారు. అనంతరం శ్రీకాంత్, సాయిప్రసాద్‌ కలిసి చిలుకానగర్‌లోని బార్‌కు వచ్చి మద్యం తాగుతుండగా అక్కడికి వచ్చిన ఉదయ్‌శంకర్‌ కూడా వారితో కలవడంతో ముగ్గురూ కలిసి మద్యం తాగారు.  అనంతరం పాత తగాదాలు ప్రస్తావనకు రావడంతో ముగ్గురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో శ్రీకాంత్, ఉదయశంకర్‌ కలిసి ప్రసాద్‌పై దాడి చేయడమేగాక బీరు సీసాతో తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో బార్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా గాయపడిన సాయిప్రసాద్‌ను చిలుకానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన శ్రీకాంత్, ఉదయశంకర్‌ అక్కడ ప్రథమ చికిత్స అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించినా వినకుండా క్యాబ్‌లో అతడి ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సాయిప్రసాద్‌ పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే  మృతిచెందినట్లు నిర్ధారించారు. సాయిప్రసాద్‌ తండ్రి లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement