
అంబర్‌పేటలో పోలీసు బలగాలు
అంబర్‌పేట : అంబర్‌పేటలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. స్థలం కూల్చివేతపై నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ వివాదం రాత్రి 10 గంటలకు అదుపులోకి వచ్చింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులు వందల సంఖ్యలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలుమార్లు లాఠీ చార్జి, వాటర్ క్యానన్లను ప్రయోగించి చెదరగొట్టారు. అంబర్‌పేటలోని ప్రతి గల్లీలో పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేశారు. అర్ధరాత్రి వరకు సీపీ అంబర్‌పేట ప్రధాన రోడ్డుపైనే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. రహదారిని దిగ్బంధం చేసి సాధారణ వాహనాలను అనుమతించకుండా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సోమవారం సంఘటనా స్థలం వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పహారా కాశారు. వివాదాస్పద స్థలం వద ్దకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మూడు కేసులు నమోదు...
అంబర్‌పేటలో తలెత్తిన ఉద్రిక్తత పూర్తిగా సద్దుమణిగిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనలో గాయపడిన పోలీసులు, పౌరుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పౌరులు ఏలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్‌లో వచ్చిన వీడియోలను పరిశీలించకుండా ఇతరులకు పంపిస్తూ వదంతులు సృష్టిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. అంబర్‌పేట ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment