
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మొహంపై కొందరు దుండగులు బండరాయితో మోదీ దారుణంగా హతమార్చారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహం బయటపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై అత్యాచారం జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
రంగంలోకి ఐదు బృందాలు: శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి
చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈరోజు ఉదయమే ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాం. మహిళ ఒంటిపై దుస్తులు లేవు. వివస్త్రగా మృతదేహం పడిఉంది. ఆమె తలపై బండ రాయితో మోది చంపేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుంది. కేసును ఛేదించేందుకు ఐదు బృందాలను రంగంలోకి దింపాం. అన్ని కమిషనరేట్ల పరిధిలో పోలీసుల్ని అలర్ట్ చేశాం. త్వరలోనే కేసు ఛేదిస్తాం. మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుంది. ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment