భోపాల్‌లో కీచకపర్వం | Bhopal gang rape case: MP one of India’s most unsafe, dangerous places for women | Sakshi
Sakshi News home page

భోపాల్‌లో కీచకపర్వం

Published Sat, Nov 4 2017 3:31 AM | Last Updated on Sat, Nov 4 2017 3:31 AM

Bhopal gang rape case: MP one of India’s most unsafe, dangerous places for women - Sakshi

భోపాల్‌: భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లివస్తున్న ఓ యువతిని అడ్డుకున్న నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ‘నువ్వు చెప్పేది సినిమా కథలా ఉంది’ అని హేళన చేశారు. హబీబ్‌గంజ్‌ లోకల్, ఎంపీ నగర్, హబీబ్‌గంజ్‌ జీఆర్పీ స్టేషన్లలోని పోలీసులు ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ బాధితురాలిని 24 గంటలు తిప్పించారు. దీంతో చివరికి బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఇద్దరు నిందితుల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  

కోచింగ్‌ నుంచి తిరిగొస్తుండగా..
మధ్యప్రదేశ్‌లోని ఎంపీ నగర్‌లో సివిల్స్‌ శిక్షణ పొందుతున్న యువతి హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కోచింగ్‌ ముగించుకుని తిరిగివస్తుండగా దారిలో గోలు బీహారీ, అమర్‌ అనే ఇద్దరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. బలవంతంగా సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు దగ్గరకు ఈడ్చుకెళ్లి రేప్‌చేశారు. ఈ పాశవిక దాడిలో దుస్తులు చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏదైనా ఇవ్వాల్సిందిగా యువతి వారిని వేడుకుంది. ఇందుకు సరేనన్న గోలు దుస్తులతో పాటు మరో ఇద్దరిని తీసుకొచ్చాడు. అనంతరం నలుగురు కలసి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో సిగరెట్, తంబాకు కోసం విరామం ఇస్తూ దాదాపు 3 గంటల పాటు యువతిపై దారుణానికి పాల్పడ్డ దుండగులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె దగ్గరున్న చెవి రింగులు, ఫోన్, వాచ్, పర్సును గుంజుకుని పరారయ్యారు. ఈ పాశవిక ఘటన హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు  కేవలం 100 మీటర్ల దూరంలో జరిగింది.

ప్రతిపక్షాల విమర్శలు
బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై కాంగ్రెస్‌ పార్టీ  జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టింది. పోలీస్‌ దంపతుల కుమార్తె ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసం మూడు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మధ్యప్రదేశ్‌ ప్రతిపక్ష నేత అజయ్‌ సింగ్‌ విమర్శించారు. దీంతో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్, ఫిర్యాదును సకాలంలో స్వీకరించని హబీబ్‌గంజ్, ఎంపీ నగర్, జీఆర్పీ పోలీస్‌స్టేషన్లకు చెందిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేశారు.. ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

కథలు చెబుతున్నావా?
భద్రతా విభాగంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల సాయంతో తనపై జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన యువతికి అక్కడ  హేళనలు ఎదురయ్యాయి. యువతి వాంగ్మూలాన్ని విన్న పోలీస్‌ అధికారి ఒకరు సినిమా కథలు చెబుతున్నావా? అని హేళనగా మాట్లాడారు. హబీబ్‌గంజ్‌ లోకల్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు ఎంపీ నగర్,  హబీబ్‌గంజ్‌ జీఆర్పీ పోలీసులు ఈ ఘటన మా పరిధిలోకి రాదన్నారు. గత్యంతరం లేక యువతి తెల్లవారేవరకు తండ్రితో కలసి జీఆర్పీ స్టేషన్‌ముందే నిరీక్షించింది. తిరిగి ఇంటికి వెళుతుండగా హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డ గోలు, అమర్‌లను గుర్తించిన యువతి..తండ్రి సాయంతో వారిని తీసుకొచ్చి జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement