
సాక్షి, ముంబై : పోలీస్ స్టేషన్‌లో తనపై కంప్లెయింట్ చేయొద్దంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుదారు కాళ్లు పట్టుకునేందుకు యత్నించిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. మహారాష్ట్రలోని హదాప్సార్ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్ తిలకర్ తన వద్ద అక్రమంగా డబ్బు వసూలు చేయాలని చూశాడని రవీంద్ర బరాటే అనే వ్యక్తి కొంధ్వా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ 385 (దోపిడీ) సెక్షన్ కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారని రవీంద్ర బుధవారం మీడియాకు తెలిపారు.
తన కంపెనీలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు అనుమతి కావాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే తిలకర్ మరో ఇద్దరు వ్యక్తులు డిమాండ్ చేశారని రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లెయింట్ చేయొద్దంటూ ఎమ్మెల్యే తన కాళ్లు పట్టుకునేందుకు యత్నించాడనీ, చేతులు జోడించి క్షమాపణలు కోరాడని రవీంద్ర చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను విచారించే బదులు పోలీసులు తనపై ఎంక్వైరీ మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఇదిలాఉండగా.. రవీంద్ర చెప్పినట్టు తాను ఆయన కాళ్లు పట్టుకోలేదని ఎమ్మెల్యే తిలకర్ చెప్పుకొచ్చాడు. కేసు పెట్టొద్దని మాత్రమే ఆయనను కోరానని అన్నారు. వయసులో పెద్దవారు కావడంతో అలవాటుగా రవీంద్ర పాదాలను తాకేందుకు యత్నించి ఉండొచ్చని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.