ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: కుటుంబ ఆర్థిక సమస్యలకు తోడుగా చేసిన అప్పులు తీర్చే క్రమంలో ఈజీమనీ కోసం చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టిన ఓ బాక్సర్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 16.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన మేరకు.. ఉప్పుగూడలో నివాసముండే కోన నర్సింగ్‌రావు అలియాస్ నర్సింహా కుటుంబ పోషణ కోసం 2006లోనే చదువులను మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత పలు ఉద్యోగాలు చేశాడు. ఈ క్రమంలోనే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకొని ఏకంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. గౌలిపురా గ్రౌండ్‌లో బాక్సింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఓలా, ఉబర్ క్యాబ్‌లను అద్దెకు తీసుకున్న క్రమంలో పరిచయస్తుల నుంచి అప్పు చేశాడు. వచ్చే ఆదాయం సరిపోక అప్పులు పెరగడంతో సులభంగా డబ్బు లు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు.
సులభంగా డబ్బుల కోసం చైన్ స్నాచింగ్‌ల బాట...
తాను నివసిస్తున్న ఉప్పుగూడలో అసలైన నంబర్ ప్లేట్‌తో ద్విచక్ర వాహనం నడిపించే నర్సింగ్‌రావు చోరీ చేసే ప్రాంతాల్లో మాత్రం రెండు, మూడు నంబర్ ప్లేట్‌లు మార్చేవాడు. స్నాచింగ్‌లకు వెళ్లినప్పుడు నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తుంటాడు. ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుతూ.. ఒంటరిగా ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలలో నుంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులు లాక్కొని పరారవుతుంటాడు.
ఇలా ఏడు నెలల కాలంలో వరుసగా 10 గొలుసు దొంగతనాలు చేశాడు. ఈ సొత్తును ముత్తూట్, మణపురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థలలో కుదవపెట్టగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ...మరోవైపు అప్పులు చెల్లిస్తున్నాడు. రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం అనుమానాస్పదంగా సంచరిస్తున్న కోన నర్సింగ్‌రావును గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం బాక్సర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఆరు కేసులలో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని పరారరైనట్టు, మరో నాలుగు కేసులలో అపహరణ కోసం ప్రయత్నం చేసినట్టు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ కోసం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. ఇతనిపై పీడీయాక్టు ప్రయోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment