
ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు
గన్‌ఫౌండ్రీ: సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ బాలుడి చికిత్స విషయంలో వైద్యుల జాప్యం అతని మృతికి కారణమైన సంఘటన మంగళవారం నిలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో వైద్యులు స్పందించనందునే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, కుల్కచర్ల గ్రామానికి చెందిన శివ(12) సైకిల్‌పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
సైకిల్ హ్యాండిల్ అతని కడుపులో బలంగా తాకడంతో పేగులు, కాలేయం, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రెండ్రోజుల క్రితం వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. అతడికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పిన వైద్యులు అతని కుటుంబ సభ్యులతో సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే శస్త్రచికిత్స చేయడంలో జాప్యం జరగడంతో మంగళవారం ఉదయం శివ మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో గందరగోళం నెలకొంది. అనంతరం మృతుడి బంధువులు సూపరింటెండెంట్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా బాలుడి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలోనే అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.