నిందితులు గోపాల్, జీవన్
సాక్షి, బంజారాహిల్స్ : ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. అతని అడ్డు తొలగిస్తే తాను పెళ్లి చేసుకోవచ్చని మిత్రుడితో కలిసి అతనిపై దాడిచేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో నివసించే గోపాల్(22) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న యువతి(19) జూబ్లీహిల్స్‌లోని ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. కొంతకాలంగా గోపాల్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహంగానే ఉన్నారు. అయితే ఆ యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు.
మరో నాలుగు నెలల్లో పెళ్లి జరపాలని తీర్మానించారు. దీనిని గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదని రోజూ ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాబోయే భర్తను బెదిరించి అడ్డు తొలగిస్తే యువతి దక్కుతుందని జూబ్లీహిల్స్ దుర్గాభవాని నగర్‌లో నివసించే ఫుడ్ డెలివరీ బాయ్ అయిన తన స్నేహితుడు జీవన్(22)తో పథకం వేశాడు. ఇందులో భాగంగా యువతికి కాబోయే భర్తను కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి వద్దనే విధంగా హెచ్చరించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి మద్యం తాగిన గోపాల్ దుర్గాభవానినగర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేచివున్నాడు. పథకం ప్రకారం జీవన్ ఆ యువతికి కాబోయే భర్తను వెంటాడుతూ ఓ చోట లిఫ్ట్ కావాలని అడిగి నేరుగా తన స్నేహితుడు గోపాల్ ఉన్న చోటుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి అతనిని పిడిగుద్దులతో బాదారు.
నా లవర్‌ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావంటూ దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి కాలర్ పట్టుకుని ఆమెను వదిలేయకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. వారి నుంచి తప్పించుకుని బాధితుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న గోపాల్, జీవన్‌లను అర్థరాత్రి అరెస్టు చేశారు. వీరిపై 70(సీ) కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం నాంపల్లి పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులు ఇద్దరికీ మూడు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment