మృతిచెందిన అమరావతి (ఫైల్), అరెస్టయిన గుణశేఖరన్
అన్నానగర్: కచ్చిరాయపాళయం సమీపంలో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో వేసిన ప్రేమికుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు హత్య చేశానని పోలీసులకు అతను వాంగ్మూలం ఇచ్చాడు. విల్లుపురం జిల్లా కచ్చిరాయపాళయం సమీపం వడక్కనందల్ గ్రామ అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం కొంతమంది మేకలను మేపుతున్నారు. అప్పుడు అదే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్‌కు చెందిన బావి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు వెళ్లి చూశారు. అప్పుడు బావిలో కుళ్లిన స్థితిలో ఓ మహిళ మృతదేహం ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు చిన్నసేలం సీఐ షణ్ముగం, కచ్చిరాయపాళయం ఎస్‌ఐలు మణికంఠన్, మాణిక్యరాజా సంఘటన స్థలానికి వెళ్లి బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించి విచారణ ప్రారంభించారు. విచారణలో కచ్చిరాయపాళయం సమీపంలో ఉన్న వడక్కునందల్ కామరాజర్ నగర్‌కు చెందిన అళగపిళ్లై రెండో కుమార్తె అమరావతి (20) అని తెలిసింది.
గత నెల 28వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం పోలీసులు అమరావతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇంటికి వెళ్లి అమరావతి ఉపయోగించిన వస్తువులను పోలీసులు పరిశీలన చేశారు. అందులో ఆమె అదే ప్రాంతానికి చెందిన గుణశేఖరన్‌ను ప్రేమిస్తున్నట్లు తెలిసింది. గుణశేఖరన్ (28) వద్ద పోలీసులు విచారణ చేశారు. విచారణలో నేను, అమరావతి ఒకటిన్నర సంవత్సరంగా ప్రేమించుకుంటున్నాం. గత 28వ తేదీ రాత్రి అమరావతి, తన ఇంటి వెనుకభాగంలో ఉన్న పొలం వద్దకు రమ్మని తెలిపింది. వెంటనే నేను రాత్రి 9గంటలకు అక్కడికి వెళ్లాను. అప్పుడు అమరావతి ఇంటి నుంచి రూ.20 వేలు తెచ్చాను, మనం కేరళకి వెళ్లి పెళ్లి చేసుకుందామని తెలిపింది. ఇందుకు నేను వ్యతిరేకం తెలిపాను. కానీ అమరావతి తనను వివాహం చేసుకోమని నన్ను ఒత్తిడి చేసింది. దీంతో ఆగ్రహం చెంది నేను చున్నీతో అమరావతి గొంతు నులిమి హత్య చేశాను. తరువాత అక్కడ ఉన్న బావిలో పడేసి రూ.20వేలను తీసుకుని ఇంటికి వచ్చి నాలుగు రోజులుగా ఖర్చు చేశాను. కానీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయానని వాంగ్మూలం ఇచ్చాడు. అనంతరం పోలీసులు గుణశేఖరన్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment