
తండ్రీ కొడుకులు రామకృష్ణ, నరేష్‌లు ఆత్మహత్య చేసుకున్న 202వ నంబర్ ప్లాట్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలోని ఓ స్టేషన్‌లో జరిగిన వ్యవహారం తాజాగా పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ కేసుకు సంబంధించి విచారణలో జరిగిన తంతు క్రైం సినిమాను తలపించేలా నడిచింది. ఈ వ్యవహారంలో సదరు అధికారి పై పోలీసు ఉన్నతాధికారులకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడం, ఏసీబీ వల వేసేలోపు సదరు అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం గంటల వ్యవధిలో జరిగిపోయింది. తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 18వ తేదీన రాజమహేంద్రవరం నగరం ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దేపల్లి కాలనీ యశోదా ఆర్కెడ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 202లో మద్దిపాటి రామకృష్ణ (64), అతని కుమారుడు మద్దిపాటి నరేష్ (32)లు పురుగులు మందు తాగి, ఆ పై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సొంత ప్లాస్టిక్ డబ్బాలు, పైపులు, ప్యాకింగ్ అట్టపెట్టెల కంపెనీలో తయారయ్యే వస్తువులను రిటైల్‌గా విక్రయించేందుకు రామకృష్ణ వీఎల్‌పురంలో దుకాణం నిర్వహిస్తున్నారు. తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. ఒకే తాడుతో ఆలింగనం చేసుకుని చనిపోయిన ఘటన చుట్టుపక్కల వారితోపాటు ఘటనా స్థలాన్ని సందర్శించిన అప్పటి పోలీసులనూ కలిచివేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సమస్యల పరిష్కారంపై విభేదాలే ఈ ఆత్మహత్యలకు దారితీశాయి. చనిపోయే ముందు బంధువులు, విడిగా ఉంటున్న భార్య తదితరులతో మాట్లాడిన రామకృష్ణ తమ ఆత్మహత్యలకు గల కారణాలను నాలుగు పేజీల లేఖలో వరుసగా పేర్లు, వారి ఫోన్ నంబర్లు, వారు తమను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ సవివరంగా వివరించారు. నిందితులు తప్పించుకు నే వీలు లేకుండా ఆత్మహత్యలకు గల కారణాలను పేర్కొం టూ రాసిన లేఖను పలు కాపీలు తీసి ఫ్లాట్‌లోని హాలు, బెడ్‌రూమ్, వంటగది, డైనింగ్ టేబుల్, సోఫా తదితర ప్రాంతాల్లో ఉంచాడు. ఆ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తప్పించేందుకు చట్టంతో బేరం..
లేఖలో పేర్కొన్న పది మంది పేర్లు, వివరాల ఆధారంగా పోలీసులు నిందితులైన రామకృష్ణ బంధువులను స్టేషన్‌కు పిలిపించారు. కొంత మంది అదే రోజు అక్కడకు రావడంతో స్టేషన్‌కు తరలించారు. మూడు నాలుగు రోజులు స్టేషన్‌లో ఉన్న సమయంలో కేసు నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మార్గాలను వెతికారు. సదరు వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు నగరానికి చెందిన ప్రముఖులతో లంచాల ఆశ చూపిస్తూ ముందుకు కదిలారు. ఈ ఘటలో ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేస్తారు? ఆ సెక్షన్ వల్ల ఎలాంటి శిక్ష పడుతుంది? వాటికి బదులు ఇంకే సెక్షన్ పెట్టవచ్చు? తద్వారా శిక్ష నుంచి వీలైనంతగా ఎలా తప్పించుకోవచ్చు? తదితర అంశాలపై చర్చలు స్టేషన్‌లోనే జరిగాయి. ఈ మేరకు శిక్ష నుంచి తప్పించేందుకు భారీగా ముడుపులు చేతులు మారినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల ఫొటోలు తీసేందుకు, చుట్టుపక్కల వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఇంటిలిజెన్స్ నిఘా, ఏసీబీకి ఫిర్యాదులు...
ఆరు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో నిందితులకు సులువుగా బెయిల్ వచ్చేందుకు తగిన సహకారం అందించిన నేపథ్యంలో భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు సమాచారం. పది మందిలో ఒక్కొక్కరికి వేర్వేరుగా చెల్లింపుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో జరుగుతున్న వ్యవహారంపై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా వేశాయి. పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశాయి. మరోవైపు నిందితుల్లో ఒకరు ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో జరిగిన వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేసి నిర్థారణకు వచ్చారు. ఈలోపు 22వ తేదీన ఇదే స్టేషన్ పరిధిలోని సుబ్బారావు పేటలో బాణాసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను పరిశీలించేందుకు వచ్చిన ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తి ఈ ఘటనను కారణంగా చెబుతూ ప్రకాశ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సూర్యభాస్కరరావును సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు, తండ్రీకొడుకుల ఆత్మహత్య కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా మాట్లాడాల్సి వస్తుందని, చివరకు తామే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భావనతో అసలు కారణం చెప్పలేదన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది.