అన్న, చెల్లెలు మృతికి కారణమైన నీటిగుంత
తూప్రాన్: విహారం విషాదాంతం అయింది. నీటిగుంత అన్న, చెల్లెలిని మింగేసింది. రెండు కుటుంబాలు ఆనందంగా ఉన్న తరుణంలో పెను విషాదం చోటు చేసుకుంది. మునిగిపోతున్న వారిని కాపాడి అన్న, చెల్లెలు విగత జీవులైన ఘటన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో జరిగింది. ఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నర్సింహులు దేవుని మొక్కు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నరసింహస్వామి గుట్ట వద్దకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. తన ఇద్దరు చెల్లెళ్లయిన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన సునీత, నరేందర్ దంపతులు, కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత, వారి కుటుంబ సభ్యులను ఆహా్వనించాడు. దేవుని వద్ద మొక్కులు తీర్చుకొని భోజనాలు చేశారు. అనంతరం పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినోద్‌కుమార్ అనే బాలుడితో పాటు మరో బాలిక గుట్ట కింద ఉన్న నీటిగుంతలో పడిపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న లలిత కుమారుడు ప్రశాంత్(22) వెంటనే గుంతలో పడి ఉన్న ఇద్దరు చిన్నారులను పైకి లాగేసి ఒడ్డున పడేశాడు. కానీ తరువాత అతడు ఆ గుంతలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన అతని చిన్నమ్మ కూతురు పావని (17) అన్నను కాపాడేందుకు గుంతలోకి దిగి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో పావనిని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావని మృతి చెందింది. అలాగే నీటి గుంతలో పడి మృతిచెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment