నవరతన్‌రెడ్డి, స్నేహలత
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరిగుట్ట అడవుల్లో వృద్ధ దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు సమీపంలో ఉన్న నందిగామకు చెందిన నవరతన్‌రెడ్డి (76), భార్య స్నేహలతారెడ్డి (72)కి కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో 60 ఎకరాల పొలం ఉంది. వీరు అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉండగా ఈనెల 14న వీరు అదృశ్యమైనట్లు హుమ్నాబాద్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం అనంతగిరి గుట్ట కెరెళ్లి ఘాట్ రోడ్డు పక్కన పొదల్లో ఓ శవం ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తుండగా మరో శవం కనిపించింది.
అప్పటికే మిస్సింగ్ కేసుపై దృష్టిసారించిన పోలీసులు అదృశ్యమైన వృద్ధ దంపతుల టెంపరరీ కారు డ్రైవర్ సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడ్ని పట్టుకుని అనంతగిరిగుట్టకు వచ్చిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే స్థానిక పోలీసులు అక్కడ ఉన్నారు. మృతుల నగలు, డబ్బుపై కన్నేసిన కారు డ్రైవర్ సతీశ్ వీరిని హతమార్చాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత 12వ తేదీన హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్ వెళ్తున్న క్రమంలో తన స్నేహితుడు రాహుల్ సాయంతో కారులోనే ఇద్దరినీ హతమార్చారు. శవాలను అనంతగిరి అడవుల్లో పడేశారు. అనంతగిరికి వచ్చిన హుమ్నాబాద్ పోలీసులు.. స్థానిక పోలీసుల సాయంతో శవాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment