
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న ఉద్యోగిపై పదునైన కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. హత్య అనంతరం దుండగులు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. నేరేడ్‌మెట్‌లోని మల్కాజిగిరి కోర్టు, డీసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో వినోభానగర్ మార్గంలో శుక్రవారం జరిగిన ఈ దారుణహత్య స్థానికం గా కలకలం సృష్టించింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
దంపతుల మధ్య మనస్పర్థలు: మృతుని తల్లిదండ్రులు, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం సమీపంలో రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్‌ఐ ఎంజాల శ్రీధర్, భార్య సంధ్య, కొడుకు ఎంజాల చందర్(32)తో కలసి నివసి స్తున్నారు. చందర్ గచ్చిబౌలిలోని ఇన్నోమైండ్స్ సాఫ్ట్‌వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన సుహాసినితో 2010లో అతనికి వివాహం జరిగింది. అయితే కొంతకాలానికే దంపతుల మధ్యలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి.
హత్య జరిగిందిలా..
మనస్పర్థలతో చందర్, సుహాసిని విడిపోయా రు. 2012 నుంచి వీరి మధ్య మల్కాజిగిరి కోర్టులో విడాకుల కేసు, సిటీ సివిల్, ఎస్సీ, ఎస్టీ కోర్టుల్లో మూడు కేసులు కొనసాగుతున్నాయి. శుక్రవారం చందర్ తల్లిదండ్రులతో కలసి మల్కాజిగిరి కోర్టు కేసు విచారణ కోసం శుక్రవారం ఉదయం వచ్చారు. కోర్టు సమీపం లోని వినోభానగర్ నుంచి కాకతీయ నగర్‌కు వెళ్లే మార్గం(కల్లు దుకాణం సమీపం)లో తమ కారును పార్క్ చేసి కోర్టుకు వెళ్లారు. 11.30 గంటల సమయంలో తిరిగి వెళ్లేందుకు చందర్ తల్లిదండ్రులతో కలసి కారు వద్దకు వచ్చారు. తల్లిదండ్రులు కారులో కూర్చున్నారు.
బావా.. బావా అంటూ వచ్చి..
అదే సమయంలో వెనుక నుంచి బావా.. బావా అంటూ కొందరు పిలుస్తూ కారు వద్దకు వచ్చారు. వచ్చిన వ్యక్తులు ఏదో మాట్లాడుతుం డగా చందర్ పట్టించుకోకుండా కారు ఎక్కేందు కు డోర్ తీస్తుండగా వెనుక నుంచి కత్తితో దాడి జరిగింది. చందర్ వారిని ప్రతిఘటించే ప్రయ త్నం చేశాడు. మరికొందరు దుండగులు కత్తుల తో అతనిపై దాడికి తెగబడ్డారు. కారులో ఉన్న తల్లిదండ్రులు కేకలు వేస్తూ కిందకు దిగారు. తమ కుమారునిపై దాడి చేయొద్దని ప్రాధేయ పడినా దుండగులు జాలి చూపలేదు.
మెడ కింది భాగం, గొంతు పక్కన, తలపై కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై చందర్ కుప్ప కూలి అక్కడికక్కడే కన్నుమూశాడు. అనంత రం నిందితులు కాకతీయనగర్ వైపు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఒక సంచిలో నిందితులు వాడిన కత్తులను గుర్తించింది. ప్రధాన నిందితునిగా అనుమాని స్తున్న వినయ్ మినహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ప్రాధేయ పడినా వినలేదు: చందర్ తల్లిదండ్రులు
తమ ఎదుటే కన్నకొడుకు విగతజీవిగా మారడంతో చందర్ తల్లిదండ్రులు శ్రీధర్, సంధ్య గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. తమ కొడుకు చందర్‌పై మల్కాజిగిరికి చెందిన వినయ్(బావమరిది)తోపాటు నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని వారు పోలీసులకు వివరించారు. కోర్టు పరిసరాల నుంచి కారు వరకు తమను అనుసరిస్తూ వచ్చిన దుండగులు తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని, ఎంత ప్రాధేయపడినా వినలేదని కన్నీరుమున్నీరయ్యారు.
నిందితుల కోసం గాలింపు: ఏసీపీ
చందర్ హత్య కేసులో అతని భార్య సోదరుడు వినయ్, మరికొంత మంది ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ కృష్ణమూర్తి విలేకరులకు వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment