
దిలీప్ కుమార్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, దిలీప్ కుమార్ (ఫైల్)
సాక్షి, ఐరాల (పూతలపట్టు) : పూతలపట్టు మండలంలోని పి. కొత్తకోట సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్‌లో గురువారం బీటెక్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు..పలమనేరు చెందిన విజయకుమార్ (లేట్), భగవతి (ఆర్టీసీ కండక్టర్) దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ (26) పి.కొత్తకోట సమీపంలోని కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతను సెల్ఫీ తీసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణం?
ప్రేమ వ్యవహారం వల్లే దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొందరితో ఛాటింగ్ చేసిన ట్లు, అందులో తాను చదువుతున్న కాలేజీ అమ్మాయితో ఎక్కువ సేపు చాట్ చేసినట్లు సమాచారం. సంఘటన స్థలానికి వెళ్లేంతవరకు మృతుడి సెల్ కెమెరా వీడియో లైవ్‌లోనే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. దిలీప్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని సెల్ఫీ వీడియోగా తీయడంతో పోలీసులు దానిని చూశారు. అనంతరం అది లాక్ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.
మృతుడు చదువులో ప్రావీణ్యుడు
దిలీప్ కుమార్ మృతి చదువుల్లో ప్రావీణ్యం కలవాడని కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. దిలీప్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కళాశాలకు వచ్చాడని, అయితే గురువారం మధ్యాహ్నం భోజనానంతరం ఒంట్లో నలతగా ఉందని చెప్పి హాస్టల్ రూములోనే ఉండిపోయాడన్నారు. అయితే అతడి సహచరులు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రూము వద్దకు చేరి తలుపు తట్టినా తీయకపోవడంతో తలుపులు పగలకొట్టి చూడగా గది లోపల ఉన్న కొక్కీకి దిలీప్ వేలాడుతూ కనిపించడంతో పోలీసుల సమాచారం ఇచ్చామన్నారు. ఆపై అతడిని పి.కొత్తకోట ఆసుపత్రి తరలించి వైద్యుల సూచనల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా దిలీప్ ముభావంగా ఉంటున్నాడని, రాత్రి సమయాల్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో ఆవేదనగా మాట్లాడేవాడని విద్యార్థులు చెప్పినట్లు తెలిపారు.