విమానం ఎక్కేదాకా వారు జైల్లోనే! | CCS Police New Strategy On Foreign Criminals | Sakshi
Sakshi News home page

విమానం ఎక్కేదాకా వారు జైల్లోనే!

Published Wed, Jun 20 2018 10:29 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

CCS Police New Strategy On Foreign Criminals - Sakshi

డ్రగ్స్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన విదేశీయులు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు వివిధ ఆశలు చూపించి ఆన్‌లైన్‌ ద్వారా ఎర వేస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న విదేశీ నేరస్తుల విషయంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. అధిక నేరాలకు పాల్పడ్డ కేసుల్లో వీరు బెయిల్‌ తీసుకుని తర్వాత ఆచూకీ లేకుండా పోతుండడంతో వారు తమ దేశాలకు తిరిగి వెళ్లేదాకా జైల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ఇటీవల పలు ఆన్‌లైన్‌ నేరాలకు పాల్పడ్డ నైజీరియన్‌ ఆచూకీ కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాదాపు ఆరు నెలల పాటు శ్రమించారు. ఎట్టకేలకు ఢిల్లీలో అతడి కదలికలు కనిపెట్టి అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాదాపు 15 రోజుల పాటు గాలించి పట్టుకుంది. ఇలా చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన అతగాడు వారం రోజులకు బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చి ఆపై రెండేళ్లుగా ఆచూకీ లేకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి ఉదంతాలకు తావు లేకాకుండా చూసేందుకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు చర్యలు ప్రారంభించారు. తీవ్రమైన నేరాల్లో అరెస్టయిన విదేశీయులకు బెయిల్‌ ఇవ్వొద్దని, నిర్ణీత కాలంలో తాము చార్జ్‌షీట్లు దాఖలు చేస్తామని న్యాయ విభాగానికి ఇటీవల ప్రతిపాదించారు. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ విభాగం అందుకు అంగీకరించింది. దీంతో సైబర్‌ నేరాల్లో చిక్కిన ఇద్దరు నైజీరియన్లతో పాటు అక్రమంగా నివసించడంతో పాటు బోగస్‌ గుర్తింపు కార్డులు పొంది చిక్కిన పాకిస్థానీ సైతం బయటకు వచ్చే అవకాశం లేదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి ట్రయల్‌ నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

రెండు రకాల చర్యలకు అవకాశం 
దేశంలో అక్రమంగా నివసిస్తూ చిక్కిన విదేశీయులపై రెండు రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమికంగా వారి పాస్‌పోర్ట్‌పై ‘ఎగ్జిట్‌ స్టాంప్‌’ కొట్టడం ద్వారా స్వదేశానికి బలవంతంగా తిప్పిపంపే (డిపోర్టేషన్‌) ఆస్కారం ఉంది. అలాకానప్పుడు, ఉదంతం తీవ్రతను బట్టి వారిపై కేసు నమోదు చేసి ట్రయల్‌ నిర్వహించవచ్చు. ఇలా కేసు నమోదైతే మాత్రం తక్షణం డిపోర్టేషన్‌ చేయడానికి చట్టం అంగీకరించదు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేసి, విచారణ పూర్తై, శిక్షపడేతే అది అనుభవించిన తర్వాతే తిప్పి పంపాల్సి ఉంటుంది. ఈలోపు బెయిల్‌ పొందుతున్న ఈ విదేశీయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసుల విచారణ ఆగిపోవడంతో పాటు మరో ప్రాంతంలో వారు యథేచ్ఛగా నేరాలు చేస్తున్నా గుర్తించి, పట్టుకోలేని పరిస్థితి ఉంది. నగరం విషయానికి వస్తే ఇక్కడ చిక్కుతున్న వారిలో ఆఫ్రికా దేశాలతో పాటు పాక్, బంగ్లాదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలోనూ నల్లజాతీయులతోనే ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. వీరు అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ఏదో ఒక పోలీసు కేసు నమోదైతే తప్ప ఈ విషయం వెలుగులోకి రావట్లేదు. దీంతో వెంటనే డిపోర్టేషన్‌ చేసే ఆస్కారం ఉండడం లేదు.  

పాస్‌పోర్ట్‌ ‘భద్రపరిచి’ రాక..  
సిటీలో జరుతున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ విక్రయాల్లో ఎక్కువగా నల్లజాతీయులు అరెస్ట్‌ అవుతున్నారు. వీరంతా తొలిదశలో విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై దేశంలోని ఏదో ఒక మెట్రో నగరానికి చేరుకుంటున్నారు. అక్కడ ఉంటూ ఈ దందాల్లోకి దిగుతున్నప్పుడే తమ పాస్‌పోర్టులను కొందరి వద్ద భద్రపరిచి, నేరబాట పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆయా నిందితులు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. కనీసం వాటి నంబర్లు, కొన్ని సందర్భాల్లో తమ నిజమైన పేర్లు కూడా ఈ నేరగాళ్లు బయటపెట్టడం లేదు. అవి లభిస్తే తప్ప సీజ్‌ చేయడానికి, రద్దు చేయించడానికో ఆస్కారం లేదు. ఈ కారణంగానే బెయిల్‌పై వచ్చిన వారు తమ దేశాలకు చెక్కేస్తున్నా గుర్తించలేని, పట్టుకోలేని పరిస్థితి. దీనివల్ల ఓపక్క కేసుల విచారణ ముందుకు సాగకపోవడంతో పాటు అనేక నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఈ పరిణామాలు ఇటు న్యాయస్థానాలతో పాటు అటు పోలీసులకూ పని భారం పెంచుతున్నాయి. నేరం చేసిన వాళ్లు స్వేచ్ఛగా విహరించే ఆస్కారం ఇస్తున్నాయి. 

బెయిల్‌ ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. 
సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా అరెస్ట్‌ అయిన వ్యక్తి దోషిగా తేలే వరకు జైల్లోనే మగ్గిపోకుండా బెయిల్‌ పొందడం చట్టం కల్పించిన అవకాశం. అయినప్పటికీ విదేశీ నేరగాళ్లకు బెయిల్‌ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం ఆయా కేసుల్లో నిందతులను అరెస్ట్‌ చేసిన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో (ప్రత్యేక కేసుల్లో మినహా) అభియోగపత్రాలు దాఖలు చేయాలి. కీలక కేసుల్లో ఈ కోణంలో పోలీసులు విఫలమైనప్పుడే న్యాయస్థానాలు నిందితులకు బెయిల్‌ ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు తాము నిర్ణీత కాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేస్తామంటూ న్యాయ విభాగం దృష్టికి తీసుకువెళ్లారు. విదేశీ నేరస్తుల విషయంలో ఇది కచ్చితంగా అమలయ్యేలా చర్యలు కుంటున్నట్లు వివరించాయి. దీనికి సమ్మతించిన న్యాయ విభాగం పూర్వాపరాల నేపథ్యంలో విదేశీ నేరస్తులకు బెయిల్‌ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు విచారణ, శిక్ష పూర్తయిన తర్వాత నేరుగా డిపోర్టేషన్‌ చేయడానికి నిర్ణయించామని సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement