ఆమెగా చెప్పుకున్న నైజీరియన్‌ అరెస్టు | Cheating Case Files on Nigerian in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆమెగా చెప్పుకున్న నైజీరియన్‌ అరెస్టు

Published Tue, Apr 23 2019 7:05 AM | Last Updated on Tue, Apr 23 2019 7:05 AM

Cheating Case Files on Nigerian in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అమెరికన్‌ ఆర్మీలో పని చేస్తున్న మహిళా అధికారిణిని అంటూ సోషల్‌మీడియా ద్వారా పరిచయమై, డాలర్లు పంపుతున్నానంటూ ఎర వేసి నగరవాసిని మోసం చేసిన నైజీరియన్‌ను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెçస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణేలో పట్టుకున్న ఇతగాడిని నగరానికి తరలించి రిమాండ్‌కు పంపినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి సోమవారం పేర్కొన్నారు. నైజీరియాకు చెందిన న్వాంబా రేమండ్‌ ఇఫేనీయి బిజినెస్‌ వీసాపై భారత్‌కు వచ్చి పుణేలో ఉంటున్నాడు. సోషల్‌మీడియాలో వేర్వేరు పేర్లతో అనేక ఖాతాలు తెరిచిన ఇతను వాటి ఆధారంగా అనేక మందికి సందేశాలు పంపిస్తూ స్నేహం, ప్రేమ పేరుతో బుట్టలో వేసుకునేవాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సందేశం పంపిన రేమండ్‌ తనను అమెరికన్‌ ఆర్మీలో పని చేస్తున్న మహిళ అధికారిణి బిల్లే మాతగా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు చాటింగ్‌ చేసిన తర్వాత అసలు కథ మొదలెట్టాడు.

తనకు భారీ స్థాయిలో డాలర్లు దొరికాయంటూ చెప్పి ఆర్మీలో పని చేస్తుండటంతో వాటిని తాను వాడుకోలేనని, ఆ మొత్తం పార్శిల్‌ రూపంలో పంపేస్తానని, హైదరాబాద్‌లో ఎక్స్‌ఛేంజ్‌ చేయాలంటూ చిరునామా తీసుకున్నాడు. అలా ఎక్స్‌ఛేంజ్‌ చేసిన మొత్తాన్ని తాను హైదరాబాద్‌ వచ్చి తీసుకుంటానని, సహకరించినందుకు 30 శాతం కమీషన్‌ ఇస్తానన్నాడు. ఇందుకు బాధితుడు అంగీకరించడంతో డాలర్లు పార్శిల్‌ చేసినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు కొరియర్‌ డెలివరీ బాయ్‌నంటూ నేరుగా ఫోన్‌ చేశాడు. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను అడ్డుకున్నారని , జీఎస్టీ, టెర్రరిస్ట్‌ సర్టిఫికెట్‌ తదితర సుంకాలు చెల్లించాలంటూ కొన్ని ఖాతా నెంబర్లు ఇచ్చాడు. ఇతడి మాటలు నమ్మిన బాధితుడు వివిధ దఫాల్లో మొత్తం రూ.1.05 లక్షలు ఆయా ఖాతాల్లో డిపాజిట్‌ చేశాడు. ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ నేతృత్వంలో ఎస్సైలు వెంకటేశం, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, సునీల్‌కుమార్, సందీప్‌ ఈ కేసును దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంక్‌ ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్లిన బృందం పుణేలో రేమండ్‌ను పట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement