జర్నలిస్ట్ జే డే , చోటా రాజన్
సాక్షి, ముంబై: జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే (జే డే) హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ సహా మొత్తం 9 మంది దోషులకు ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 2011 నాటి ఈ కేసులో దోషులందరూ ఒక్కొక్కరు రూ.26 లక్షల జరిమానా చెల్లించాలని మోకా (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం–ఎంసీవోసీఏ) కోర్టు ఆదేశించింది. జే డేను హత్య చేసేలా చోటారాజన్‌ను మాజీ జర్నలిస్టు జిగ్నా వోరా ప్రేరేపించారనీ, అలాగే ఈ హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాల్‌సన్ జోసెఫ్ నిర్వహించారంటూ నమోదైన అభియోగాలను న్యాయమూర్తి సమీర్ అడ్కర్ కొట్టివేస్తూ వారిరువురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. 2015లో చోటా రాజన్ ఇండోనేసియాలోని బాలి విమానాశ్రయంలో అరెస్టయ్యి, భారత్‌కు వచ్చాక అతను దోషిగా తేలిన ప్రధాన కేసు ఇదే. బుధవారం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణను చోటా రాజన్ వీక్షించాడు.
అసలు కేసేంటి?
జే డే (చనిపోయినప్పటికి ఆయన వయసు 56 ఏళ్లు) ముంబైలో మిడ్ డే అనే పత్రికకు సీనియర్ ఎడిటర్‌గా పనిచేసేవారు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, మాఫియాలో అతని బలం తగ్గిందంటూ వార్తలు రాయడంతో జే డేపై చోటా రాజన్ కోపం పెంచుకుని హత్య చేయించాడు. 2011 జూన్ 11న జే డే తన ఇంటికి వెళ్తుండగా ముంబైలోని పొవాయ్ ప్రాంతానికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో జే డే మరణించారు. ఈ కేసుకు సంబంధించి అదే ఏడాది జూన్ 27న ఏడుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి మోకా కింద అభియోగాలు మోపారు. 2016 జనవరిలో ఈ కేసు సీబీఐకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment