రోదిస్తున్న చిన్నారి అమృత తల్లి , జాయింట్ వీల్
ఎగ్జిబిషన్ నిర్వాహకులు భద్రతాప్రమాణాలు పాటించకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారి తిరిగిరాని లోకాలకు చేరింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో సందర్శకులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
అనంతపురం సెంట్రల్: నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో రోబో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగర వాసులే కాకుండా జిల్లా నలుమూలల నుంచి కూడా ఎంతోమంది తమ పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్‌కు వచ్చారు. రోబో యానిమల్స్‌ను తిలకిస్తూ.. వాటి వద్ద సంతోషంగా సెల్ఫీలు దిగారు. అటు నుంచి లోనికి వెళ్లి వివిధ రకాల స్టాల్స్‌ను పరిశీలించారు. బ్రేక్‌డ్యాన్స్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, క్రాస్ వీల్, ట్రైన్, జీపు, స్కూటర్ రైడింగ్ తదితర వాటిలో తిరుగుతూ ఆనందంగా గడిపారు.
ఇంకొందరు జాయింట్‌వీల్ ఎక్కారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో జాయింట్‌వీల్‌లోంచి రెండు బాక్సులు ఊడి 50 అడుగుల ఎత్తులోంచి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు కుమార్తె అమృత(8), అనంతపురం మండలం కొడిమికి చెందిన రాఘవేంద్ర కుమార్తె జ్యోతి, శ్రీరాములు కుమార్తె రాధమ్మ, గుత్తికి చెందిన రాజు భార్య జర్షితి మేరీ, బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన కృష్ణమూర్తి భార్య గంగాదేవి, అనంతపురం మండలం రుద్రంపేటకు చెందిన కృష్ణ కుమారుడు వాసుతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో అమృత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దైవదర్శనం నుంచి తిరిగి వస్తూ..
ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన రాజు, అనంతపురం మండలం రుద్రంపేటకు చెందిన కృష్ణ ఇరువురూ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక ఆదివారం అనంతపురం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన రోబో యానిమల్స్ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. జాయింట్‌వీల్‌లో తిరుగుతున్నపుడు ప్రమాదం జరగడంతో రాజు కుమార్తె అమృత (8) ప్రాణం విడిచింది. అమృత తల్లి ఆస్పత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది.
నిర్వాహకులపై ఆగ్రహం
జాయింట్‌వీల్ విరిగి చిన్నారి మృతి చెంది.. మరో ఆరుగురు గాయపడినప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు పట్టించుకోలేదు. యథావిధిగా ఎగ్జిబిషన్ కొనసాగిస్తుండటంపై స్థానికులు ఆగ్రహించారు. జాయింట్‌వీల్ ఆపరేటర్ రఘు మద్యం మత్తులో ఉండటం గమనించి.. అతడిని చితకబాదారు. అతడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్‌వీల్ ఆపరేటర్ రఘును త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఎగ్జిబిషన్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలియగానే డీఎస్పీ వెంకట్రావ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి సర్వజనాస్పత్రికి చేరుకుని గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొందరిని మెరుగైన వైద్యం కోసం సవేరా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలో వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment