రికవరీ చేసిన నగలు, నగదు(ఫొటో కర్టెసీ: ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
న్యూఢిల్లీ : యజమాని నమ్మకాన్ని సంపాదించిన ఓ మహిళ అదును చూసి ఖరీదైన నగలతో ఉడాయించింది. వారం రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు... షంషుద్దీన్ మెచెరీ పరాంబ అనే వ్యక్తి భార్యతో కలిసి గ్రేటర్ కైలాష్-2లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ మహిళ వాళ్లింట్లో వంట మనిషిగా చేరింది. పరాంబ భార్య గర్భవతి కావడంతో వంట పనులతో పాటుగా అన్ని పనుల్లోనూ ఆమెకు తోడుగా ఉంటూ నమ్మకం చూరగొంది. అయితే వారం రోజుల క్రితం పరాంబ, అతడి భార్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన సమయంలో నగలు, డబ్బు దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో మోసపోయామని గుర్తించిన పరాంబ దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో.. మూడు రాష్ట్రాలు గాలించి ఎట్టకేలకు కిలాడి వంట మనిషిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయం గురించి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘నవంబరు 14న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పరాంబ ఫిర్యాదు చేశారు. సుమారు 20 లక్షల విలువ చేసే స్విస్ చోపర్‌్డ నెక్లెస్, రూ. 20 వేల విలువ గల చెవి దుద్దులు, వాచ్ లేబుల్, నగదు పోయిందని కంప్లెంట్ ఇచ్చారు. అదే విధంగా తమ ఇంటి పనిమనిషి కూడా కనిపించకుండా పోయిందని మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో విచారణ జరుపగా వంట మనిషే దొంగతనానికి పాల్పడిందన్న విషయం బయటపడింది. ఏజెన్సీ ద్వారా ఆమె చిరునామా కనుగొని తొలుత ఉత్తరప్రదేశ్‌లో ఆమె పుట్టింటికి వెళ్లాం. అక్కడి నుంచి ఆమె బిహార్ వెళ్లినట్లుగా.. అటునుంచి జార్ఖండ్ చేరుకున్నట్లుగా గుర్తించాం’ అని తెలిపారు.
ఈ క్రమంలో జంషెడ్‌పూర్‌లో తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న తనను అరెస్టు చేసి తీసుకువచ్చామని వెల్లడించారు. ‘విచారణలో భాగంగా 4 లక్షల రూపాయలు తన తల్లికి, రెండు లక్షల రూపాయలు అత్తింటివారికి ఇచ్చినట్లు.. మరికొంత సొమ్ముతో బాకీ తీర్చినట్లు నిందితురాలు నేరం అంగీకరించింది. మిగతా సొమ్మును రికవరీ చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా స్విస్ చోపర్‌్డ నెక్లెస్‌లు సాధారణంగా రెడ్ కార్పెట్‌పై నడిచే సినీ సెలబ్రిటీలు మాత్రమే ధరిస్తారన్న సంగతి తెలిసిందే. అత్యంత ఖరీదైన ఈ నగల్ని సామాన్యుల ఇళ్లలో పెట్టుకోరు. ఈ విషయం గురించి పరాంబ మాట్లాడుతూ.. తాను నెక్లెస్‌ను బయోమెట్రిక్ లాకర్లో పెట్టడం మరిచిపోయినందు వల్లే దొంగతనం జరిగిందని వాపోయింది. తనను ఎంతో నమ్మించి వంట మనిషి ద్రోహానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment