హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు | Cops Ride On Prostitution Center In Nellore | Sakshi
Sakshi News home page

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

Published Thu, Jul 25 2019 12:42 PM | Last Updated on Thu, Jul 25 2019 12:42 PM

Cops Ride On Prostitution Center In Nellore - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, చిత్రంలో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ

సాక్షి, నెల్లూరు: ఓ హైటెక్‌ వ్యభిచార కేంద్రంపై నెల్లూరులోని దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఎస్సై జిలానీ, సిబ్బంది దాడి చేసింది. నలుగురు నిర్వాహకులను, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించే క్రమంలో కొందరు నకిలీ మీడియా ప్రతినిధులు బెదిరించి నగదు దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని, దోచుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు.

సైదాపురం మండలం ఆదూరుపల్లి గ్రామానికి చెందిన ఎం.బాలకృష్ణ, ఓ గ్రామానికి చెందిన మహిళ భార్యభర్తలమని చెప్పి మాగుంట లేఔట్‌ డీమార్ట్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలయపల్లికి చెందిన ఎన్‌.అజయకుమార్, నగరంలోని శ్రీనివాస అగ్రహారానికి చెందిన ఎస్‌.గోపాల్‌ను కలుపుకుని వారు కొంతకాలంగా కోల్‌కత్తా, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచార కేంద్రం నడుపుతున్నారు. ఈ విషయంపై దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మకు సమాచారం అందింది. బుధవారం ఆమె ఆధ్వర్యంలో ఎస్సై షేక్‌ జిలానీ, సిబ్బంది వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

బెదిరించి నగదు వసూలు 
పోలీసులు వారిని విచారించగా నకిలీ మీడియా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. సావిత్రినగర్‌కు చెందిన ఎస్‌.విజయనిర్మల, చాణిక్యుపురికి చెందిన సీహెచ్‌ సూర్యనారాయణ, శాంతినగర్‌కు చెదిన పి.హరిబాబు, వీఎంఆర్‌ నగర్‌కు చెందిన పి.జిలానీ, గాంధీనగర్‌కు చెందిన కె.నరేష్, వేదాయపాళేనికి చెందిన జి.మహేష్, ఏసుపాదం, నగరానికి చెందిన రోజారాణి, ఆమె కుమారుడు నకిలీ మీడియా ప్రతినిధులుగా అవతారమెత్తారు. వారు నెల్లూరు బ్రేకింగ్‌న్యూస్, నెల్లూరు పబ్లిక్‌న్యూస్‌ ఇలా పలు సంస్థల ప్రతిని«ధులమంటూ వ్యభిచార కేంద్రాల్లోకి వెళ్లి నిర్వాహకులను బెదిరించి నగదు వసూలు చేయసాగారు. వీరు ఈనెల 20వ తేదీన ప్రస్తుతం పట్టుబడిన వ్యభిచార కేంద్రంలోకి ప్రవేశించి రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని మీడియాలో చూపిస్తాని నిర్వాహకులను బెదిరించారు.

వారు అంత మొత్తం లేదని చెప్పి రూ.70 వేల నగదు ఇవ్వడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ చాణుక్యపురిలోని బ్రేకింగ్‌న్యూస్‌ కార్యాలయంపై దాడిచేసి అక్కడున్న విజయనిర్మల, సూర్యనారాయణ, హరిబాబు, జిలానీ, నరేష్, మహేష్, ఏసుపాదంలను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకులతోపాటు, నకిలీ మీడియా ప్రతిని«ధులను అరెస్ట్‌ చేశామన్నారు. రోజారాణి, ఆమె కుమారుడు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని డీఎస్పీ తెలిపారు. వ్యభిచార కేంద్రంపై దాడి, నకిలీ మీడియా గుట్టురట్టు చేసిన దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ, ఎస్సై షేక్‌ జిలానీ, హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.ప్రసాద్, కానిస్టేబుల్స్‌ ఎం.మహేంద్రనాథ్‌రెడ్డి, ఎ.తిరుపతిలను శ్రీనివాసులురెడ్డి అభినందించి ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement