సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పని చేసే ఓ సంస్థ కొత్త తరహా మోసానికి తెరలేపింది. తమ వద్ద డబ్బు చెల్లించి ఎల్‌ఈడీ టీవీ పొందాలని, అందులో వచ్చే యాడ్స్ చూస్తూ ఉంటే నెలనెలా తామే కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటామని ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకుంది. దీన్ని చూసిన ముగ్గురు నగరవాసులు రూ.2.49 లక్షలు చెల్లించి మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూరత్‌కు చెందిన డోర్ టైజర్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆన్‌లైన్‌లో యాడ్స్ ఇచ్చింది. అందులో తమ వద్ద రూ.83 చెల్లిస్తే అత్యాధునికమైన ఎల్‌ఈడీ టీవీ పంపిస్తామని నమ్మబలికింది. అంతటితో ఆగకుండా తమ వద్ద సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక యాప్ ద్వారా ఆ టీవీలో కొన్ని ప్రకటనలు చూపిస్తామంటూ చెప్పింది. వీటిని క్రమం తప్పకుండా చూస్తే ప్రతి నెలా కనిష్టంగా రూ.11,500 చొప్పున చెల్లిస్తామంటూ ఎర వేసింది.
ఈ ప్రకటన చూసి ఆకర్షితులైన ముగ్గురు నగరవాసులు అందులోని నెంబర్లకు సంప్రదించారు. ఒక్కోక్కరు రూ.83 వేల చొప్పున రూ.2.49 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఈ యాడ్స్ యాడ్స్ ఓఎల్‌ఎక్స్‌లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనలకు ఇద్దరు నగరవాసులు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లకు సంబంధించిన వీరు బేరసారాలు పూర్తి చేశారు. ఆపై అడ్వాన్సుల పేరుతో రూ.40 వేలు, రూ.74 వేలు చెల్లించి మోసపోయారు. ఇంకో ఉదంతంలో నగరానికి చెందిన ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌కు సైబర్ నేరగాళ్ళు ఫొన్ చేశారు. తాము ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తక్కువ వడ్డీకి భారీ మొత్తం రుణం అంటూ ఎర వేశారు. బాధితుడు అంగీకరించడంతో ఇతడి నుంచి కొన్ని పత్రాలు సైతం వాట్సాప్ చేయించుకున్నారు. చివరకు ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర పేర్లు చెప్పి రూ.40 వేలు కాజేశారు.
Comments
Please login to add a commentAdd a comment