సాక్షి, సిటీబ్యూరో: మీరు మద్యం ప్రియులా...మద్యం తాగాలని ఉబలాట పడుతున్నారా... లాక్‌డౌన్ వేళ మీకు ఎక్కడా లభించని మద్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వగానే మీ ఇంటికొచ్చి మరీ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశను క్యాష్‌గా మలచుకొని వారి ఖాతాల్లో డబ్బులను గుల్ల చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ అమలులో మద్యం దుకాణాలు మూసివేసి ఉండటంతో అదే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేస్తున్నారు. ఆధునిక సాంకేతికతపై మంచి అవగాహన ఉన్న వీరు గూగుల్ సెర్చ్ ఆప్షన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాప్‌ల పేరుతో తమ నంబర్లను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. గూగుల్‌లోని వైన్‌షాప్ నియర్ మీ అని కొడితే గూగుల్‌లో వచ్చేలా చిరునామాలు అందుబాటులో ఉంచారు. (శానిటైజర్లు తాగేస్తున్నారు)
అయితే సామాజిక మాధ్యమాల ద్వారా ఇది నిజమేననుకొని కొంతమంది ఆ లింక్ కిక్ చేసి మరీ వారు అడిగిన రెండింతల రేటుకు డబ్బులను బ్యాంక్ ఖాతాల నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆయా నంబర్లను సంప్రదిస్తే ఎటువంటి స్పందన ఉండటం లేదు. ఇటువంటి రెండు కేసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అందుకే ఆన్‌లైన్‌ల ద్వారా ఆర్డరిస్తే ఇంటికే మందు అనే లింక్‌లను నమ్మవద్దని, లాక్‌డౌన్ వేళ అసలు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ రకంగా ప్రజలను మోసం చేసే నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment