సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రూటుమార్చారు. ఇన్నాళ్లూ మీ బ్యాంక్ ఏటీఎం, క్రెడిట్ కార్డులు అప్‌డేట్ చేస్తామంటూ కాసులు కొల్లగొట్టిన క్రిమినల్స్.. ఇప్పుడూ సామాన్యుల అరచేతిలో పైసలు చెల్లింపు వేదికగా మారిన పేటీఎం నుంచి నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్‌డేట్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్‌ఫోన్లకు కాల్ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.
రూపాయి బదిలీ చేయమంటారు..
సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్‌డేట్ చేసే సమయంలో యాప్‌లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు.
ఇవి చేయకండి..
‘పేటీఎం అకౌంట్‌లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్‌కాల్ చేసి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయమని అడగరు. ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపరు. అకౌంట్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్‌లను అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్‌లోడ్ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్‌లోడ్ చేయించిన అప్లికేషన్‌ల ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యక్ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాల’ని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.
కేసులిలా..
♦ గత నెల 23న కూకట్‌పల్లి వాసి రవిశంకర్ సెల్‌ఫోన్‌కు మీ పేటీఎం కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ ఓ అపరిచిత ఫోన్ నంబర్ నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది. వెంటనే రవిశంకర్ సదరు నంబర్‌కు ఫోన్‌కాల్ చేశారు. ఆయన అకౌంట్‌ను అప్‌డేట్ చేసేందుకు పేటీఎం వివరాలు కావాలనడంతో పాటు ఏనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రూ.100లు నామినీ డబ్బుగా పంపితే అప్‌డేట్ అవుతుందని నమ్మించాడు. ఇది నమ్మిన రవిశంకర్ ఆ యాప్ డౌన్‌లోడ్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారు. పేటీఎం నుంచి దశలవారీగా రూ.62,345లు డెబిట్ అయ్యాయని సెల్‌కు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
♦ జనవరి 23న సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వాసి ఫక్రుద్దీన్ మహమ్మద్‌కు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలంటూ పేటీఎం ప్రతినిధిగా ఫోన్‌కాల్ వచ్చింది. మీ పేటీఎం అప్‌డేషన్ కోసం క్విక్ సపోర్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ బ్యాంక్ ఖాతా వివరాలు అప్‌డేట్ చేయమనడంతో చేశాడు. ఆ వెంటనే దశలవారీగా రూ.78.399 పేటీఎం నుంచి డెబిట్ అయినట్టుగా ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment