టీ.నగర్: చిన్నారి హాసినిని, తల్లి సరళను చంపలేదని కిరాతకుడు దశ్వంత్ మాటమార్చడంతో పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సేకరించే పనిలోపడ్డారు. కుండ్రత్తూరుకు చెందిన కిరాతకుడు దశ్వంత్ చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిపై ఫిబ్రవరిలో అత్యాచారం చంపేశాడు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన అతను ఈనెల 2న తల్లి సరళను హత్య చేసి నగలతో ముంబైకి పరారవగా పోలీసులు అరెస్టు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు. చిన్నారి హత్య కేసు విచారణకు చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుకాని దశ్వంత్‌కు పీటీ వారెంట్ జారీ అయింది.
దీంతో దశ్వంత్‌ను ఆ కోర్టులో పోలీసులు హాజరుపరుస్తున్నారు. విచారణ సమయంలో మాంగాడు గ్రామ నిర్వాహక అధికారి, తలారి, పక్కింటి మహిళ, హాసిని చదివిన పాఠశాల నిర్వాహకులను న్యాయమూర్తి వేల్‌మురుగన్ విచారించారు. ఈ కేసు విచారణ శుక్రవారం మళ్లీ జరిగింది. దశ్వంత్‌ను భారీ భద్రత నడుమ పోలీసులు చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో పోలీసు వ్యాను నుంచి కిందికి దిగిన దశ్వంత్ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి హాసినిని, తన తల్లి సరళను తాను హత్య చేయలేదన్నాడు. త్వరలో తగిన అనుమతితో పూర్తివివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తర్వాత న్యాయమూర్తి వేల్‌మురుగన్ సమక్షంలో దశ్వంత్‌ను
కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దిగ్భ్రాంతి: కొన్ని రోజుల క్రితం దశ్వంత్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ అవసరం లేదని, తనకు శిక్షను విధించాలని కోరాడు. ప్రస్తుతం హాసినిని, తల్లి సరళను తాను హత్యచేయలేదని చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దశ్వంత్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను బలపరిచేందుకు, కొత్త సాక్షులను చేర్చేందుకు పోలీసులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment