
మర్సీల్లె: ఫ్రాన్స్‌లోని మర్సీల్లె నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఆదివారం సెయింట్ చార్లెస్ రైల్వే స్టేషన్ వద్ద 'అల్లాహో అక్బర్' అని అరుస్తూ.. ఇద్దరు మహిళలను కత్తితో పొడిచి హతమార్చాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే నిందితుడిని సంఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పోలీసులు భావిస్తుండగా.. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. తమ సైనికుడే ఈ దాడి చేశాడని ఐసిస్ మీడియా వింగ్ అమాక్ వెల్లడించింది.
ఈ కిరాతక ఘటనలో 17, 20 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. నల్లదుస్తులు ధరించిన దుండగుడు ఒక యువతిని గొంతు కోసి హతమార్చగా.. మరో యువతి ఛాతిపై, కడుపులో కత్తితో పొడవడంతో అక్కడే ప్రాణాలు విడిచారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతనికి ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉండవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిందితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, అతను సాధారణ నేరస్తుడేనని, అతని గురించి స్థానిక అధికారులకు తెలిసి ఉండే అవకాశముందని కథనాలు వెలువడుతున్నాయి. పారిస్‌లోని స్పెషల్ ప్రాసిక్యూటర్ ఈ ఉగ్రవాద ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు.