ప్రమాదస్థలంలో కారు, పడిపోయిన బైకు
తెనాలి: తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి మాధవి ప్రయాణిస్తున్న కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వేరొక వాహనంలో మాధవి వెళ్లిపోగా, క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆలపాటి మాధవి, హనుమాన్‌పాలెం–గుంటూరు రహదారిలో తిరిగి వెళుతుండగా, రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. తెనాలి రూరల్ మండలం ఖాజీపేట సెంటరులో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది.
ఈ దుర్ఘటనలో బైకుపై వస్తున్న సమీప కొలకలూరు గ్రామ యువకులు సుద్దపల్లి రవీంద్ర (30), పొన్నెకంటి పవన్‌కుమార్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పవన్‌కుమార్ మృతి చెందగా, రవీంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. విషయం తెలిసిన కొలకలూరు దళితవాడ ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకుని, ఆందోళన చేపట్టారు. తెనాలి రూరల్ ఎస్‌ఐ రాంబాబు అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment