అమ్మకానికి విదేశీయుల ‘డెబిట్‌ కార్డు డేటా’ | Debit Cards data Sales in Online Gang Arrest | Sakshi
Sakshi News home page

అమ్మకానికి విదేశీయుల ‘డెబిట్‌ కార్డు డేటా’

Published Sat, Oct 6 2018 9:07 AM | Last Updated on Mon, Oct 22 2018 1:43 PM

Debit Cards data Sales in Online Gang Arrest - Sakshi

నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: విదేశీయుల డెబిట్‌ కార్డుల సమాచారాన్ని పిన్‌ నెంబర్లతో సహా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న హ్యాకర్లు వచ్చే లాభాల్లో చెరి సగమంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఇలా కొందరు విదేశీయుల సమాచారాన్ని కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులు.. దీని ఆధారంగా క్లోన్డ్‌ డెబిట్‌ కార్డులు రూపొందించారు. అనంతరం ఆ కార్డులతో రూ.60 వేలు డ్రా చేయడంతో విషయం ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చేరి నిందితులు కటకటాల పాలయ్యారు. ఈ ద్వయం పోలీసులకు చిక్కకుండా ఉంటే గనుక భారీ స్కామ్‌కు పాల్పడేదని అదనపు డీసీపీ చైతన్యకుమార్‌ శుక్రవారం తెలిపారు. నగరంలోని కంచన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అఫ్రోజుద్దీన్‌ అలియాస్‌ అలీ పెద్దగా చదువుకోకపోయినా స్మార్ట్‌ఫోన్, యాప్స్‌ వినియోగంపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే అలీ తన ఫోన్‌లో ‘ఐసీక్యూ’అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని అనేక మందితో చాటింగ్‌ చేస్తుండేవాడు. అలీకి ఈ యాప్‌ ద్వారానే అభి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని రోజులు చాటింగ్‌ చేసిన తర్వాత తాను విదేశీయుల డెబిట్‌ కార్డుల డేటా, పిన్‌ నెంబర్లు విక్రయిస్తానంటూ అలీకి చెప్పాడు. అయితే అలా చేయడానికి ముందు తనకు పూర్తి స్థాయిలో నమ్మకం కలగాలన్నాడు.  

స్నేహితుడిని కలవడానికి వచ్చి..
అంతగా చదువుకోని అలీ అతడితో చాటింగ్‌ చేయడం, నమ్మకం కలిగించడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే నెల రోజుల క్రితం పంజాబ్‌కు చెందిన పంకజ్‌ సచ్చదేవ్‌తో అలీకి పరిచయమైంది. పంకజ్‌ చేసేది కూలి పని అయినా రెండేళ్లు న్యూజిలాండ్, ఎనిమిదేళ్లు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసి వచ్చాడు. దీంతో పంకజ్‌కు ఆంగ్లంపై కొంత పట్టు ఉంది. ఆస్ట్రేలియాలో ఉండగా తనతో కలసి పనిచేసిన ఓ స్నేహితుడిని కలవడానికి పంకజ్‌ పాతబస్తీకి వచ్చాడు. ఆ స్నేహితుడి ద్వారా పంకజ్‌కు అలీతో పరిచయం ఏర్పడింది. పంకజ్‌ విషయం తెలుసుకున్న అలీ తనకు యాప్‌లో పరిచయమైన అభితోపాటు అతడు ఇచ్చిన ఆఫర్‌ విషయం చెప్పాడు. అతడి వద్ద నమ్మకం పొంది కార్డుల డేటా సంగ్రహించగలిగితే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తక్కువ శ్రమతో భారీ మొత్తం సంపాదించవచ్చని చెప్పడంతో పంకజ్‌ సహకరించడానికి అంగీకరించాడు. పంకజ్‌ సాయంతో అభితో చాటింగ్‌ చేసిన అలీ అతడి నమ్మకాన్ని పొందాడు. నెల రోజుల క్రితం 200 డాలర్లు బిట్‌కాయిన్స్‌ రూపంలో అభికి చెల్లించాడు. దీంతో అతడు 15 మంది విదేశీయులకు చెందిన డెబిట్‌ కార్డుల డేటా, పిన్‌ నంబర్లు అదే యాప్‌ ద్వారా పంపాడు. వీటిలో అన్నీ సక్రమంగా ఉండవని, సక్సెస్‌ అయిన వాటికి సంబంధించిన మొత్తంలో తనకు సగం ఇవ్వాలని షరతు పెట్టాడు.  

ఎంఎస్‌ఆర్‌ మెషిన్‌ వినియోగించి క్లోనింగ్‌..
ఇలా వచ్చిన డేటాను కార్డుల్లోకి ఎక్కిస్తే (రైట్‌ చేస్తే) తప్ప వినియోగించే ఆస్కారం ఉండదు. ఏ కార్డుల్లోకి, ఎలా ఎక్కించాలనే విషయాన్ని అభి ద్వారా వీరు తెలుసుకున్నారు. కంచన్‌బాగ్‌ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని క్లోనింగ్‌ వ్యవహారం మొదలెట్టారు. స్టార్‌ హోటళ్లలో రూమ్స్‌ బుక్‌ చేసుకున్నప్పుడు తాళంగా యాక్సస్‌ కార్డు ఇస్తారు. ఈ కార్డులోకి అవసరమైన వివరాలు హోటల్‌ రిసెప్షన్‌లోని వారు ఎంఎస్‌ఆర్‌ మెషిన్‌ ద్వారా రైట్‌ చేస్తారు. అభి సూచనల మేరకు ఇలాంటి మెషిన్‌ను ఖరీదు చేసి అలీ, పంకజ్‌లు తమ గదిలో పెట్టుకున్నారు. అభి పంపిన డేటాను ఫోన్‌ నుంచి ల్యాప్‌టాప్‌లోకి మార్చి దాన్ని ఈ మెషిన్‌తో అనుసంధానించారు. మాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడిన, ఎలాంటి బ్యాలెన్స్‌ లేని డెబిట్, క్రెడిట్‌ కార్డుల్ని సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని ఎంఎస్‌ఆర్‌ మెషిన్‌లో ఉంచుతోంది. ల్యాప్‌టాప్‌ ఆధారంగా ఆపరేట్‌ చేస్తూ అభి పంపిన కార్డుల డేటాను వీరు సేకరిస్తున్న కార్డుల్లోకి రైట్‌ చేస్తోంది. తొలి దశలో 15 కార్డుల డేటా పొందగా.. కేవలం రెండింటికి చెందిన సమాచారమే కరెక్ట్‌గా ఉంది. ఇలా రెండు కార్డులు తయారు చేసిన అలీ, పంకజ్‌లు రూ.50 వేలు, రూ.10 వేలు చొప్పున డ్రా చేశారు. మరికొన్ని కార్డుల డేటా పొందటం కోసం రూ.50 వేలు అభికి బిట్‌కాయిన్స్‌ రూపంలో బదిలీ చేశారు. భారీ స్టాయిలో క్లోన్డ్‌ కార్డులతో దందా చేయాలని పథకం వేసిన వీరి వ్యవహారంపై ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌కు అందింది. ఆయన నేతృత్వంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం శుక్రవారం దాడి చేసి అలీ, పంకజ్‌లను పట్టుకుంది. వీరి నుంచి ల్యాప్‌టాప్, ఎంఎస్‌ఆర్‌ మిషన్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును కంచన్‌బాగ్‌ పోలీసులకు అప్పగించింది. ఈ డేటాను హ్యాకర్లు ఎక్కడ నుంచి సేకరిస్తున్నానేది తెలియాలంటే అభి చిక్కాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement