
మృతి చెందిన విజయకుమార్ అలియాస్ సిసింద్రీ
వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట : ఖాజీపేట మండలం బుడ్డాయపల్లెకు చెందిన విజయకుమార్ అనే డిగ్రీ విద్యార్థి హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. విద్యార్థిని రోకలిబడెతో కొట్టి హతమార్చి.. కారులో తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు తెలుస్తోంది. బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన విజయకుమార్ అలియాస్ సిసింద్రి ఖాజీపేట లోని సాహిత్య డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఒక విద్యార్థినితో పరిచయం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుండేది. ఈ విషయం అమ్మాయి కుటుంబీకులకు తెలియడంతో వారు పలుమార్లు అబ్బాయిని మందలించడంతో పాటు దాడికి కూడా పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయినా వీరిలో ఎలాంటి మార్పు లేక పోవడంతో విజయకుమార్‌ను హతమార్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
రోకలి బండతో కొట్టి చంపారు..
గ్రామస్తులు, విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. విజయకుమార్ శనివారం రాత్రి ఇంటిలో భోజనం చేశాడు. తరువాత సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి మిద్దె పైకి వెళ్లి పడుకున్నాడు. అదే రోజు రాత్రి అతను ప్రేమిస్తున్న అమ్మాయిని కలిసేందుకు రావాల్సిందిగా ఆమె కుటుంబీకులు విజయ్‌కి సమాచారం అందించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థిని సాంబశివారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తులు గ్రామంలోని స్కూల్ వెనుక భాగంలోకి తీసుకెళ్లారు. అక్కడ రోకలి బండ తీసుకుని తలపై కొట్టడంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఒక సంచి పట్టలో చుట్టి కారులో తీసుకుని కడప టోల్‌గేట్ ప్లాజా మీదుగా కమలాపురం మండలంలోని గంగాయపల్లె వరకు తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేశారు. మృతదేహం పై నుంచి రైలు వెళ్లడంతో శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో అక్కడ నుంచి వారు వెల్లిపోయారు. అయితే ఇందులో విజయ్‌కి ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్లాడా లేక ఎవరైనా వచ్చి బయటకు తీసుకెళ్లారా అనేది తేలాల్సి ఉంది. అలాగే హత్య జరిగింది పేరారెడ్డికొట్టాలు స్కూల్ వెనుక భాగంలో నేనా లేక మరెక్కడైనా జరిగిందా అన్నది పోలీసు విచారణలో బయటకు రావాల్సి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు సరిగా స్పందించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా కూడా చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై కేసును వేగవంతం చేశారు.
పోలీసుల చేతికి పూర్తి ఆధారాలు
విజయ్ మృతికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితుల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. అలాగే ప్రేమ లేఖలతోపాటు, మెమొరీ కార్డు తదితర ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
హత్య కేసు విచారణ వేగవంతం
విద్యార్థి హత్య కేసులో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైల్వే పోలీసుల నుంచి బుధవారం కేసుకు సంబంధించిన ఫైల్ పోలీసుల చేతికి వచ్చింది.. అలాగే మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ హనుమంతునాయక్‌లు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరుపున వారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను కూడా గుర్తించారు. వారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ వారిని అదుపులోకి తీసుకుని ఎలా హత్య చేశారనే విషయాన్ని రాబడుతున్నట్లు తెలిసింది. హత్య సంఘటనలో ఎంత మంది పాల్గొన్నారు. ఎవరి ప్రమేయం ఉంది అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు.
అరెస్టుకు రంగం సిద్ధం
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించి అన్ని ఆధారాలు సేకరించారు. తామే హత్య చేసినట్లు అనుమానితులు పోలీసుల ఎదుట అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment