
కవిత మృతదేహం( ఫైల్ పొటో)
మాడుగులపల్లి(నల్గొండ) : అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెంలో శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం కుక్కడం ఆవాసం చింతలగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి కవిత(25)ను గండ్రవానిగూడెం గ్రామానికి చెందిన రామలింగంకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కొంతకాలంగా కవితను భర్త రామలింగం, మామ వెంకటయ్య, అత్త అంజమ్మ అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. కవితకు, రామలింగంకు పలుమార్లు గొడవలు జరిగాయి.
వీటిని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకున్నారు. మళ్లీ తిరిగి నెల రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని, లేనియడల రామలింగం రెండో పెళ్లి చేసుకుంటాని కవి తను బెదిరిస్తున్నాడని, మానసికంగా హింసిస్తుండడంతో కవిత శనివారం రాత్రి పురుగుల మందు తాగినట్టు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి పక్కన వారు కవిత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కవిత తండ్రి కొమ్ము వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment