లక్ష నగదుతో ఏసీబీకి పట్టుబడిన రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment