వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం
చెట్టంత ఎదిగిన కొడుకు చేతికందకపోగా.. చెత్త కుప్పలో శవమై తేలాడు. ఆ తల్లి శోకం కట్టలు తెంచుకుని గుండెలవిసేలా రోదించింది. హృదయ విదారకంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. పంజాబ్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్లితే...
ఛండీఘడ్: కొట్కాపుర ప్రేమ్ నగర్ ప్రాంతంలో బల్విందర్ సింగ్(22) కుటుంబం నివసిస్తోంది. బల్విందర్ స్వీట్ షాపులో పని చేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా అతను ‘చిట్టా’ అనే డ్రగ్‌కు అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవర్ డోస్ తీసుకుని బల్విందర్ ప్రాణాలు విడిచాడు. చెత్త కుప్పలో కొడుకు విగతజీవిగా పడిఉన్నాడన్న సమాచారం అందుకున్న తల్లి పరుగున అక్కడికి చేరుకుంది. గుండెలు బాదుకుంటూ మృతదేహం ముందు రోదించింది. హృదయవిదారకంగా ఉన్న ఆ దృశ్యాలను అవతార్ సింగ్ అనే స్థానికుడు తన ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో విషయం మీడియాకు చేరింది.
‘మాదక ద్రవ్యాలకు నా కొడుకు అలవాటు పడ్డాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా నా మాట వినలేదు. చెడు సావసమే నా కొడుకు ప్రాణం తీసింది. నా దుస్థితి మరే తల్లికి రాకూడదని దేవుడ్ని వేడుకుంటున్నా. డ్రగ్స్ ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అవలంభించాలి’ అని బల్విందర్ తల్లి కశ్మీర్ కౌర్ అంటోంది. అయితే బ్లాక్ జాండీస్‌తో అతను చనిపోయినట్లు కొటక్‌పుర ఎస్‌ఎస్‌పీ నానక్ సింగ్ చెబుతుండగా, బల్విందర్ చేతిలో సిరంజీ ఉండటాన్ని మీడియా ఛానెళ్లు ప్రముఖంగా చూపిస్తున్నాయి.
చిట్టా భూతం... ‘పంజాబ్‌లో 80 శాతం యువత ‘చిట్టా’ మాదక ద్రవ్యానికి అలవాటుపడిపోయారని, బల్విందర్ కూడా ఆ భూతానికే బలయ్యాడని’ వీడియో తీసిన అవతార్ సింగ్ చెబుతున్నాడు. డ్రగ్స్ మాఫియా దశాబ్దాలుగా పంజాబ్‌ను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా చిట్టా అనే మాదకద్రవ్యం మరింత ప్రమాదకంగా మారింది. హెరాయిన్, ఎక్స్టెసీ, ఎల్‌ఎస్‌డీ, మెతంపెటామైన్స్ కలయికతో తయారు చేసే ఈ డ్రగ్ యువత పెద్ద సంఖ్యలో బానిసలుగా మారారని(మారుతున్నారు కూడా) గణాంకాలు చెబుతున్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ.. డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొలువుదీరాక.. డ్రగ్స్ మాఫియాను నాలుగు వారాల్లో తుదముట్టిస్తామని ప్రతినబూనారు. అయితే నెలలు గడుస్తున్నా ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదన‍్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం చిట్టా మూలంగానే అమృత్‌సర్‌లో ఇద్దరు యువకులు చనిపోవటం పెను కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment