అశ్లీల వెబ్‌సైట్లు చూశారంటూ డబ్బు డిమాండ్‌ | Email Threats Cases Filed in Hyderabad | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ వేళ ఈ–బెదిరింపులు!

Published Mon, Apr 20 2020 8:00 AM | Last Updated on Mon, Apr 20 2020 8:00 AM

Email Threats Cases Filed in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌... ఇటీవల కాలంలో నగరంలో పెరుగుతున్న సైబర్‌ నేరం ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 18 రోజుల్లోనే ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీరిని బెదిరించడానికి సైబర్‌ నేరగాళ్లు వాడుతున్న అస్త్రమే... అశ్లీల వెబ్‌సైట్లు సందర్శన. అలా చేయనివారు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తుండగా.. వీక్షించిన వాళ్లు మాత్రం గప్‌చుప్‌గా నేరగాళ్లు కోరిన మొత్తాలు చెల్లించేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా అశ్లీల వెబ్‌సైట్ల వీక్షణం గణనీయంగా పెరిగిందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్‌ వెబ్‌సైట్‌గా పేరుగాంచిన పోర్న్‌ హబ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ ధోరణి కొనసాగుతోంది. దేశంలోని దాదాపు ప్రతి టెలికం సంస్థా అశ్లీల వెబ్‌సైట్స్‌ను బ్యాన్‌ చేశాయి. అయినప్పటికీ మిర్రర్‌ డొమైన్స్‌ ద్వారా వీటిని చూస్తున్నారని పోర్న్‌ వెబ్‌ సంస్థ స్పష్టం చేస్తోంది. సాధారణ సమయాల్లో కంటే లాక్‌డౌన్‌ వేళ వీటి వినియోగం ఏకంగా 35 శాతం పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది.

దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి, తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్‌ హబ్‌ గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి నైజీరియా సహా మరికొన్ని సౌత్‌ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్‌సైట్స్‌ను రన్‌ చేస్తున్నారు. వీటికి బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్‌లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్‌ దానంతట అదే యాక్టివేట్‌ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్‌లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్‌ అయి ఆ వ్యక్తి ఫొటోను సంగ్రహిస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్‌ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది. ఈ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్‌ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలా తన చేతికి చిక్కిన వివరాలతో ఆ సైబర్‌ క్రిమినల్స్‌ అసలు పని ప్రారంభిస్తున్నారు. పోర్న్‌ సైట్‌ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్‌ ఐడీకి బెదిరింపు మెయిల్‌ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్‌ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు. నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామనో, మీ మెయిల్‌ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామనో బెదిరిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే నిర్ణీత మొత్తం బిట్‌ కాయిన్స్‌ రూపంలో చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్‌ అందుకున్న వారిలో 95 శాతం మంది బెదిరింపులకు లొంగిపోతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. 

వీక్షించకపోయినా బెదిరింపులు...
అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించిన వారితో పాటు చూడని వారికీ ఈ ఈ–మెయిల్‌ బెదిరింపులు తప్పట్లేదు. నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మందీ ఈ కోవకు చెందిన వారే అని అధికారులు చెబుతున్నారు. అనేక డొమైన్లకు చెందిన ఈ–మెయిల్‌ ఐడీలను, పాస్‌వర్డ్స్‌ ను అనునిత్యం కొందరు సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తూ ఉంటారు. ఇలా సంగ్రహించిన వివరాలను డార్క్‌ నెట్‌ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. డీప్‌ వెబ్, డార్క్‌ వెబ్‌ గానూ పిలిచే ఈ డార్క్‌ నెట్‌ అనేది ఇంటర్‌ నెట్‌ ప్రపంచంలో అథోజగత్తు లాంటిది. సాధారణ బ్రౌజర్లు, విండోస్‌ ద్వారా ఎవరూ డార్క్‌ నెట్‌లోకి వెళ్లలేదు. దీనికి ప్రత్యేకమైన ట్రోజర్లు ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే డార్క్‌ నెట్‌లోకి వెళ్లి, బిట్‌ కాయిన్ల రూపంలో చెల్లింపు చేస్తూ సైబర్‌ క్రిమినల్స్‌ కొన్ని ఈ–మెయిల్‌ ఐడీలు, వాటి పాస్‌వర్డ్స్‌ ఖరీదు చేస్తున్నారు. వారందరికీ బెదిరింపు ఈ–మెయిల్స్‌ పంపిస్తూ అశ్లీల వెబ్‌సైట్స్, చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూశారంటూ బెదిరించి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. నేరగాళ్లు పంపుతున్న మెయిల్స్‌లో తమ పాస్‌వర్డ్స్‌ సైతం ఉంటుండటంతో వీటిని అందుకున్న వాళ్లు ఆందోళనకు గురై పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిది మంది విషయంలో ఓ సారూప్యత ఉంది. వీళ్లందరూ వినియోగిస్తున్నది హాట్‌ మెయిల్‌.కామ్‌ కాగా... బెదిరింపు ఈ–మెయిల్స్‌ పంపిన వారంతా ఔట్‌లుక్‌.కామ్‌ వాడారు. వీరిలో కొందరికి వచ్చిన మెయిల్స్‌లో వారి ప్రస్తుత పాస్‌వర్డ్స్‌ కాకుండా గతంలో వినియోగించినవి పొందుపరిచారు. ఇలాంటి మెయిల్స్‌ వచ్చిన వాళ్లు భయపడవద్దని, తక్షణం తమ మెయిల్స్‌కు చెందిన పాస్‌ వర్డ్స్‌ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్‌ పంపిస్తున్నదీ నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే అని అనుమానిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement