
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుదర్శన్‌గౌడ్
పెద్దపల్లి రూరల్: సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో నకిలీ నోట్లను చలామణి చేసి.. ఏకంగా వాటిని తయారు చేసేందుకు సిద్ధపడ్డ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో పొత్కపల్లి పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు చిక్కగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. వివరాలను శనివారం పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సుదర్శన్‌గౌడ్ వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చల్లా రాయమల్లు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ గుంషావలీ నుంచి నకిలీ నోట్లను తెప్పించి రెండే ళ్లుగా చలామణి చేస్తున్నాడు. అసలు రూ. 5 వేల కు నకిలీ నోట్లు మూడు నాలుగింతలు వస్తుండడంతో ఆర్థికంగా లాభపడాలని ఆశించాడు.
గుం షావలీ నకిలీ నోట్లను తయారు చేస్తున్న తీరును గమనించి, తానూ తయారు చేసేందుకు ఉపక్రమించాడు. ఇందుకు కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కొలిపాక శ్రీనివాస్, కందుల ఉదయ్‌కుమార్, దుగ్యాల అనిల్, ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన రెడ్డి బాపురావు, కొమిరకు చెందిన నల్లగోని కుమార్, ఇందుర్తికి చెందిన తుమ్మ సదానందం, జీలకుంటకు చెందిన ముంజాల శ్రీధర్, గోనె నవీన్‌ల సహకారం తీసుకున్నాడు. వీరి కదలికలపై అనుమానంతో పొత్కపల్లి పోలీసులు విచారించగా వారి వద్ద నకిలీ కరెన్సీ బయటపడింది. పొత్కపల్లి ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ జరపడంతో రాయమల్లు వద్ద ఉన్న కంప్యూటర్, ప్రింటర్, పేపర్లతోపాటు రూ. 6లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఎస్‌ఐ ఓంకార్‌ను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ రాములు పాల్గొన్నారు.
నకిలీ దందాకు అడ్డురాని వైకల్యం
ముఠా సభ్యుల్లో ప్రధాన సూత్రధారి చల్లా రాయమల్లు వికలాంగుడు. తనకు చేతులు లేకున్నా కంప్యూటర్, ప్రింటర్ సాయంతో నకిలీ నోట్లను ఎలా ముద్రించాడో విచారణలో తెలిపిన తీరుకు అధికారులే నివ్వెర పోయారు.
Comments
Please login to add a commentAdd a comment