ఏమీ చదువుకోని నిశాని..13 పేర్ల స్పెషలిస్ట్‌ | Fake Doctor Arrested In Gachibowli Hyderabad | Sakshi
Sakshi News home page

DR.వేలిముద్ర

Published Sat, Aug 11 2018 8:02 AM | Last Updated on Tue, Aug 21 2018 1:37 PM

Fake Doctor Arrested In Gachibowli Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న సజ్జనార్‌

గచ్చిబౌలి: తాను డాక్టర్‌నంటాడు.. తనది మనీ ట్రాన్సక్షన్‌ వ్యాపారం అంటాడు.. ప్రాంతానికో పేరు చెబుతాడు.. నమ్మితే నిలువునా ముంచేస్తాడు. ఐదు రాష్ట్రాల్లో 13 పేర్లతో మోసాలకు పాల్పడ్డ ఓ ఘరానా నేరస్తుడికి తన సంతకం చేయడం తప్ప ఏమీ చదువుకోని నిశాని. మే నెలలో అమెరికా డాలర్ల మోసం కేసులో ఇతడిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా డాలర్లు ఇస్తే ఇండియన్‌ కరెన్సీ ఇస్తానని మోసాలు చేస్తున్న ఈ నేరస్తుడి చరిత్రను శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ సైబారాబాద్‌ ఎస్‌ఓటీ డీసీపీ దయానంద్‌రెడ్డి, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, సీఐలు రమణగౌడ్, పురుషోత్తం, నవీన్‌ వివరాలు వెల్లడించారు. గోవాకు చెందినసిద్ధిఖీ అలియాస్‌ సులేమాన్‌ మహ్మద్‌ ఖాన్‌(42) సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నాడు. తాను అమెరికాలో డాక్టర్‌నని చెబుతూ చుట్టుపక్కల వారికి బ్యాగ్‌లో ఉన్న కోటు, సెటత్‌స్కోప్‌ చూపించేవాడు.

గతంలో పాతబస్తీకి చెందిన రఫీక్‌ను పరిచయం చేసుకున్నాడు. ఇతడి నుంచి రెండు మూడు సార్లు డాలర్లు తీసుకొని మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ఇండియన్‌ కరెన్సీ ఇచ్చాడు. రఫీక్‌తో పరిచయమున్న మహ్మద్‌ జాఫర్‌(పాతబస్తీ) తన వద్ద 30 వేల అమెరికా డాలర్లు ఉన్నాయని వాటిని మార్చాలని అడిగాడు. ఈ విషయం తెలిసిన సిద్ధిఖీ జాఫర్‌ను ముగ్గులోకి దింపాడు. అమెరికా డాలర్లకు సమానమైన ఇండియన్‌ కరెన్సీ తాను ఇస్తానని తీసుకుర రమ్మన్నాడు. దీంతో జాఫర్‌.. రఫీక్, మొయిన్‌తో కలిసి  గచ్చిబౌలిలోని కాఫీ డేలో సిద్ధిఖీని కలిశారు. రఫీక్, మోయిన్‌లను అక్కడే ఉంచి జాఫర్‌ను డబ్బుతో పాటు కారులో ఎక్కించుకున్న నకిలీ డాక్టర్‌ సిద్ధిఖీ.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి తీసుకెళ్లాడు. పోలీస్‌ అకాడమీ సమీపంలో కారు ఆపి 30 వేల డాలర్లు తీసుకొని నకిలీ ఇండియన్‌ నోట్ల కట్టలున్న ప్యాకెట్‌ ఇచ్చాడు. పైకి రూ.రెండు వేల నోట్లు కనిపిస్తున్పటికీ లోపల తెల్ల కాగితాలు ఉన్నాయి. జాఫర్‌ అక్కడే డబ్బు లెక్కించే ప్రయత్నిం చేయగా సిద్ధిఖీ పిస్టల్‌ చూపించి అతడిని బెదిరించి కారు లోనుంచి కిందకు తోసేశాడు. అనంతరం కారులో అక్కడి నుంచి ఉడాయించాడు. నార్సింగి పోలీసులు ఓఆర్‌ఆర్, కాఫీ డేలో లభించిన సీసీ ఫుటేజీల ఆధారంగా నేరస్తుడిని హైదర్షాకోట్‌లో అరెస్ట్‌ చేశారు. 

నగదు స్వాధీనం..
నిందితుడు  సిద్ధిఖీ అలియాస్‌ సులేమాన్‌ మహ్మద్‌ ఖాన్‌ నుంచి దేశీయ పిస్టల్, ఏడు బుల్లెట్లు, రూ.26 లక్షల నగదు, 15 వేల అమెరికా డాలర్లతో పాటు నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు  రూ.5,74,500 పాత నోట్లు, నకిలీ రెండు వేల నోట్లు ఉన్న ఐదు సంచులు, 42 సెల్‌ ఫోన్లు, 304 గ్రాముల బంగారు నగలు, ఐదు స్థలాల డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్, రెండేసి అడ్రస్‌ ప్రూఫ్‌లు, ఆధార్‌ కార్డులు, 8 పాన్‌కార్డులు, 5 డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, మూడు ఓటరు ఐడీల స్వాధీనం చేసుకున్నారు.

మనీ ఎక్చెంజ్‌ పేరిట పలు మోసాలు
గోవాకు చెందిన సిద్ధిఖీ మనీ ఎక్సే్చంజ్‌ పేరిట తన 21 ఏళ్ల వయసు నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. గతంలో సంగారెడ్డిలో రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా తమిళనాడుకు చెందిన దొరైస్వామి పరిచయమయ్యాడు. ఇతది వద్దనున్న డాలర్లు ఇస్తే రూపాయలు ఇస్తానని నమ్మించాడు. ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో నకిలీ కరెన్సీ ఇచ్చి రూ.10 లక్షల విలువ చేసే డాలర్లతో ఉడాయించాడు. ఇలా దోచుకున్న నగదుతో ఇతగాడు గోవాలో ఎంజాయ్‌ చేయడం గమనార్హం. 

13 పేర్లతో సిద్ధిఖీ మోసాలు
సిద్ధిఖీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల్లో కరెన్సీ మార్పిడి పేరిట చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతగాడు 13 పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 2014లో గోవాలో స్థలం కొనుగోలు విషయంలో వృద్ధురాలు లూయిసా ఫెర్నాండేజ్‌కు ఇంజక్షన్‌ ఇచ్చి చంపిన కేసులో నిందితుడు. 2013లో పూణేకు చెందిన విమల్‌రావు కొండే దేశ్‌ముఖ్‌ను స్థలం కొనుగోలు విషయంలో మోసం చేయగా సహకార్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. 2013లో పూణేలో కంట్రీమేడ్‌ పిస్టల్‌ కొనుగోలు చేశాడు. లైసెన్స్‌ లేకుండా పిస్టల్‌ ఉండడంతో హదపసార్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. సిద్ధిఖీ ఏం చదువుకోలేదని, కేవలం సంతకం చేయడం మాత్రమే నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ నేరాలలో పాలు పంచుకోలేదన్నారు. 2013లో అతని కూతురు కింద పడడంతో కోమలోకి వెళ్లగా బెంగళూర్‌లోని ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చేర్పించాడని, ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సి వస్తుందని కూతురిని అక్కడే వదిలి పోయాడన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement