గచ్చిబౌలి: యజమాని వద్ద నమ్మకంగా ఉన్నట్లు నటించిన ఓ డ్రైవర్ అదును చూసి కారులోని రూ.50 లక్షల నగదుతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు, అతని సోదరుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీలో నివాసం ఉండే రియల్టర్ వైఎస్ ప్రసాద్ వద్ద రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన హన్మంత్ దోత్రే డ్రైవర్‌గా చేరాడు.
ఏప్రిల్ 3న రాత్రి 8.30 గంటలకు వైఎస్ ప్రసాద్ తన వ్యాపార భాగస్వాములు ఎస్.దీరజ్‌రెడ్డి, ఎంఎన్‌బీ రాజులతో కలిసి బెంజ్ కారులో ఇనార్బిట్ మాల్‌కు వెళ్లారు. కారును పార్క్ చేసిన డ్రైవర్ హన్మంత్ దోత్రే అక్కడే ఉన్నాడు. రాత్రి 9 గంటలకు వైఎస్ ప్రసాద్ కారు వద్దకు తిరిగి రాగా డ్రైవర్ కనిపించలేదు. కారు బ్యానెట్‌పై తాళాలు ఉన్నాయి. కారు డిక్కీ తెరిచి చూడగా.. అందులో రూ.50 లక్షలు గల నగదు బ్యాగ్ కనిపించ లేదు. డ్రైవర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. వైఎస్ ప్రసాద్ తన ఇంటికి వెళ్లి సర్వెంట్ రూమ్‌లో చూడగా అక్కడ కూడా డ్రైవర్ లేడు. దీంతో వైఎస్ ప్రసాద్ వ్యాపార భాగస్వామి ధీరజ్‌రెడ్డి వెంటనే మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
వెంటనే ఇనార్బిట్ మాల్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు... రాత్రి 8.42 గంటల సమయంలో హన్మంత్ క్యాష్ బ్యాగ్‌తో బయటకు వెళ్లాడని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ముంబై, సోలాపూర్, షిర్డీలకు పంపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు జహీరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. హన్మంత్ దోత్రేతో పాటు అతడి సోదరుడు లక్ష్మణ్ దోత్రేను అరెస్ట్ చేసి రూ.40.5 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు.
స్థలం కొనేందుకు వచ్చి చిక్కారు...
ఇనార్బిట్ మాల్ నుంచి క్యాష్ బ్యాగ్‌తో బయటకు వచ్చి హన్మంత్ నేరుగా మహారాష్ట్రలోని థానేలో ఉండే భార్య వద్దకు వెళ్లాడు. రూ.2 లక్షలు తన అవసరాలు, అప్పుల కోసం వాడుకున్నాడు. కొంత మొత్తాన్ని భార్యకు ఇచ్చాడు. అక్కడే ఉండే సోదరుడు లక్ష్మణ్‌ను తీసుకొని జహీరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయాలని వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. కేసును త్వరగా ఛేదించిన ఏసీపీ, మాదాపూర్ పోలీసులను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. పరిచయం లేని వ్యక్తులను డ్రైవర్‌గా పెట్టుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని డీసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రవీంద్ర ప్రసాద్, డీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐలు గోవర్థన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment