
దేవరపల్లి: జిల్లాలో నకిలీ నోట్లను తయారు చేసి మారుస్తున్న ముఠా సభ్యులను దేవరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ సి.శరత్‌రాజ్ కుమార్ వెల్లడించారు. గత నెల 21న దేవరపల్లి గురుప్రీత్ హోటల్ వద్ద కొందరు దొంగ నోట్లు మారుస్తుండగా, ఎస్సై పి.వాసు, సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని పట్టుకునే యత్నం చేశారు. ఆ సమయంలో నిందితులు ప్రతిఘటించడంతో ఎస్సై వాసు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సుంగారపు చిట్టిబాబు, పోలేపల్లి కిషోర్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో వారి నుంచి రూ.2 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ సి.శరత్‌రాజ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే దొంగ నోట్లు తయారు చేస్తున్న మరో ముగ్గురు విజయవాడకు చెందిన వారాడ సింహాద్రి నాయుడు, ఏలూరుకు చెందిన డేగల సత్యత్రిమూర్తులు, చీరాలకు చెందిన మన్నెం డేవిడ్‌రాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, కటింగ్ మిషన్, కలర్ కెమికల్స్, జిరాక్సుకు ఉపయోగించే పేపరుతోపాటు రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒరిజినల్ కరెన్సీ నోట్లను స్కానింగ్ చేసి కలర్ జిరాక్సులు తీసి మారుస్తున్నట్టు సమాచారం. మన్నె డేవిడ్‌రాజు ప్రింటర్‌ను ఉపయోగించి రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లను కలర్ ప్రింట్ చేసి ఏలూరులోని డేగల సత్యత్రిమూర్తులుకు పంపిస్తున్నట్టు, సత్యత్రిమూర్తులు ఈ నోట్లను వారాడ సింహాద్రి నాయుడు, చిట్టిబాబు, కిషోర్‌ల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మారుస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. నోట్లను మార్చినందుకు 20 శాతం కమీషన్ ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు 2017 నవంబరు నుంచి దొంగ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్టు కనుగొన్నారు. అశ్వారావుపేటకు చెందిన శ్రీదేవి ద్వారా రూ.4 లక్షలు దొంగనోట్లు మార్చారని, నూజివీడుకు చెందిన గోపి ద్వారా రూ.60 వేలు మార్చారని గుర్తించారు.
విజయవాడలో పరిచయం:
ఈ ముఠా సభ్యులందరికీ విజయవాడలో పరిచయం అయిందని సీఐ శరత్‌రాజ్‌కుమార్ తెలిపారు. డేవిడ్‌రాజుకు అప్పులు ఎక్కువగా ఉండడం, రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, కేసులు ఉండడం వల్ల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మిగతావారిని కూడగట్టి దొంగనోట్లు తయారు చేస్తున్నట్టు తెలిపారు. డేవిడ్‌రాజు కంప్యూటర్ డిప్లమో చేశాడని, అందుకే నోట్ల తయారీలో నైపుణ్యం వచ్చిందని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై పి.వాసు, ట్రైనీ ఎస్సై సాధిక్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment