విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ మోసానికి పాల్పడుతున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసుల సహాయంతో విజయ్ దేవరకొండ టీమ్ చాకచక్యంగా పట్టుకున్నారు. మోసగాడి ఫోన్ నెంబర్‌ని కనిపెట్టి అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అతను చెప్పిన మాటలన్నీ నమ్మినట్లు నటించి నిన్ను వెంటనే కలవాలి అని హైదరాబాద్‌కి రమ్మని చెప్పారు. ఈ మాటలన్నీ నమ్మిన ఆ మోసగాడు శుక్రవారం హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.
అప్పటికే పోలీసులతో సిద్ధంగా ఉన్న విజయ్ దేవరకొండ టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్‌కి తరలించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరు హీరోల పేర్లతో కొంతమంది మహిళలను ఇలానే మోసం చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఇకముందు విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఐడీల నుండి మెసేజ్‌లు వస్తే ఎవరూ నమ్మొద్దనీ విజయ్ ఆఫీస్ టీమ్ అభిమానులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment