సంగారెడ్డి ,అక్కన్నపేట(హుస్నాబాద్): అయ్యో భగవంతుడా..! అన్నెపున్నెం ఎరుగని రైతును తీసుకుపోతివా అని పల్లెవాసులు కన్నీరు పెట్టారు. తర్కవానికుంటలో మంగళవారం రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. రైతు భగవాన్‌రెడ్డి, కొడుకు ప్రేమ్‌చందర్‌రెడ్డి, కూతురు రోజాల అంత్యక్రియలకు హాజరైన ప్రజలు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు.
భగవాన్‌రెడ్డి ఎవరికీ హాని తలపెట్టకుండా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండేవాడు. దీంతో జనం వారి అంత్యక్రియలకు తరలివచ్చారు. ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం తుర్కవానికుంటలో ఇదే మొదటిసారి కావడంతో ఆ విషాదం నుంచి పల్లె ఇంకా తేరుకోలేదు. చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకునే మార్గం లేక, ఎవరి సహాయం అందకపోవడం ఆ రైతును నిత్యం వేధించాయి. సమస్యల సుడిలో కూరుకుపోయిన రైతు లోకం విడిచి వెళ్లాలని నిర్ణయించకున్నాడు.
వెంటాడిన నిరుద్యోగ సమస్య
భగవాన్ రెడ్డి తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించాడు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాడు. కానీ పిల్లులు నిరుద్యోగులుగా రెండేళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్న తీరును కలచివేసింది. ఉద్యోగాలు రావేమోననే బెంగ అతడిని కుంగదీసింది. కూతురు పెళ్లీడుకొచ్చింది. కానీ పెళ్లి చేసేంత ఆర్థిక స్థోమత లేదు. పిల్లల నిరుద్యోగ సమస్య, కూతురు పెళ్లి సమస్యలు రైతుకు జీవితం మీద విరక్తిని కలిగించాయి. పెద్ద చదువులు చదివిన పిల్లలు తనలాగే వ్యవసాయ పనులు చేయాల్సి వస్తోందని కలత చెందిన రైతు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పిల్లలకు ఆహారంలో విషం ఇచ్చి తర్వాత దంపతులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో భార్య కొట్టుమిట్టాడుతుండగా భగవాన్ రెడ్డి, అతడి పిల్లలు ఇద్దరు మరణించారు.
అందరితో కలివిడిగా ప్రేమ్‌చందర్‌రెడ్డి..
ప్రేమ్‌చందర్‌రెడ్డి గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. నిత్యం ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. ఎంబీఏ పూర్తి చేసిన ప్రేమ్‌చందర్‌రెడ్డి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాయగా 6 మార్కుల తేడాతో ఉద్యోగం చేజారింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ అన్వేషణలోనే ఉన్నాడు.
వారం క్రితమే స్వగ్రామానికి వచ్చి తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులు చేసేవాడు. ఏ రోజుకైనా ఉద్యోగం సంపాదిస్తాడు అని భావించే క్రమంలో ప్రేమ్‌చందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం స్నేహితులను, గ్రామస్తులను కలిచి వేసింది.
వేధించిన భూ సమస్య..
అక్కన్నపేట మండలంలో రెండు నెలల కింద ధర్మారంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. దీనికి భగవాన్‌రెడ్డి హాజరయ్యారు. అతడు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన (సర్వే నంబర్ 123(2)లో) 1.20 గుంటల భూమికి సంబంధించిన పట్టా ఉంది. దీంతోపాటు మరో రైతు దగ్గర 1.20 ఎకరాల భూమి సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి కబ్జాలో ఉంటూ సాగు చేస్తున్నాడు. సర్వే నంబర్ 123(2)లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారు. రైతు పేరున ఉన్న 1.20 ఎకరాలతోపాటు తాను మరో రైతు వద్ద కొనుగోలు చేసిన 1.20 ఎకరాల భూమిని పట్టా చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. ఇది లావుణి పట్టా.. దీన్ని మరో రైతు పేరు మీదకు మార్చడం వీలు కాదని కొందరు చెప్పారు. దీంతో రైతు పట్టా చేసుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. తుర్కవానికుంటలో ప్రస్తుతం ఎకరా భూమికి రూ. 6లక్షలు ధర పలుకుతుండడంతో 1.20 ఎకరాలకు 9లక్షల భూమి తనకు దక్కకుండా పోతుందేమోనని రైతు ఆందోళన చెందాడు. కుటుంబ సమస్యలు, పిల్లల నిరుద్యోగం, బతుకు నిచ్చే భూమి పట్టా సమస్యలు రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాయి.
వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని తర్కువానికుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటిని బుధవారం ఎమ్మెల్యే సతీష్‌కుమార్ సందర్శించారు. ముగ్గురి మృతికి ఆయన సంతాపం తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అతడి బంధువులను అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ భూక్య మంగ, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ చైర్మన్ లింగాల సాయన్న, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యాక నారాయణ, తదితరులు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి జగ్గారెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం
అక్కన్నపేట(హుస్నాబాద్): పోతారం(జే) పంచాయతీ పరి« దిలోని తుర్కవానికుంట గ్రా మానికి చెందిన రైతు గుండా భగవాన్‌రెడ్డి కుటుంబం మంగళవారం ఆత్మహత్యకు యత్నించగా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భగవాన్‌రెడ్డి భార్య రాజవ్వ కరీంనగర్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రాజవ్వను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించి కుటుంబానికి రూ. లక్ష నగదును అందించారు. ఆయనతోపాటు ఎల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment