మంటల్లో కాలిపోతున్న తహసీల్దార్.. మంటలను ఆర్పే క్రమంలో డ్రైవర్‌కూ మంటలు అంటుకున్న దృశ్యం..
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర రాజధాని శివారులో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఎలా జరిగిందంటే..
సమయం.. మధ్యాహ్నం 1:45 గంటలు. ప్రదేశం.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం. ఉన్నట్టుండి హాహాకారాలు.. ఆ వెంటనే భారీ పేలుడు.. దరఖాస్తుదారులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో అంతటా ఉది్వగ్న వాతావరణం. ఏం జరిగిందో తెలిసేలోపే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన భూ వివాదాన్ని మహిళా తహసీల్దార్ పరిష్కరించలేదన్న ఆక్రోశంతో ఓ రైతు హంతకుడిగా మారాడు. ఆమెను అంతం చేసేందుకు పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబ డ్డాడు. రెప్పపాటులో మహిళా తహసీల్దార ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అయితే ఈ ఘటనలో మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది తొలుత అయోమయానికి గురయ్యారు. ఆమె గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి మేడం, మేడం అని కేకలు పెట్టారు. మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహసీల్దార్‌గా గుర్తించారు. వెంటనే తహసీల్దార్ సజీవదహనంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గురునాథ్ 84%, చంద్రయ్య 40– 50% కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ నిందితుడు సురేశ్‌ను తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన పోలీసులు అతని పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి మృతదేహం. విలపిస్తున్న బంధువులు.
బదిలీ అయ్యుంటే ప్రాణాలు దక్కేవి!
తహసీల్దార్ విజయారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ లో 2016 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త మండలంగా ఏర్పాటైన అబ్దుల్లాపూర్‌మెట్ లో ఆమెకు పోస్టింగ్ లభించింది. మూడేళ్లకు పైగా ఇక్కడ పని చేసిన తనను బదిలీ చేయాలని లోక్‌సభ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీపై సర్కారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 10రోజుల కిందట విజయారెడ్డి దంపతులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం కలిశారు. తనను బదిలీ చేయాలని విజయారెడ్డి మంత్రికి విన్నవించారు. ఇంతలోనే ఆమె దారుణ హత్యకు గురవడంతో అందరూ హతాశులయ్యారు. బదిలీ జరిగి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
భర్త, పిల్లలతో విజయారెడ్డి ఫైల్ ఫొటో
భారీ పేలుడు శబ్దం వినిపించింది
మధ్యాహ్నం 1.45కు మేడం వద్దకు ఫైలుతో వెళ్లా. సరిగ్గా 5 నిమిషాల్లో ఏదో పెద్ద పేలిన శబ్దం వినిపించింది. వెంటనే మేడం చాంబర్‌వైపు పరిగెత్తాం. అక్కడ అరుపులు, కేకలు దట్టమైన పొగతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తొలుత ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనుకున్నాం. మేడం.. మేడం అని అరిస్తే మా పిలుపులకు స్పందించి మేడం చేయి లేపడంతో అప్పుడు అర్థమైంది.– సునీత, సీనియర్ అసిస్టెంట్
పేలుడు ధాటికి పగిలిన అద్దాలు
మధ్యాహ్నం 1.50 గం.కు దరఖాస్తుదారులు వచ్చారు. అప్పుడే వచ్చిన మేడం కొందరితో మాట్లాడారు. మాకు కొన్ని పనులు కూడా చెప్పారు. మేం వాటిని చూసేందుకు మా చాంబర్లలోకి వెళ్లగానే భారీ పేలుడుతో అద్దాలు పగిలిపోయాయి. మేం పరిగెత్తుకుం టూ వచ్చేసరికి మంటల్లో కాలుతున్న మేడం కనిపించారు. వెంటనే కార్పెట్లు తెచ్చి మంటలను ఆర్పాం. కానీ మేడంను కాపాడుకోలేకపోయాం. – మహేశ్ ఆర్.ఐ.
కాలిన గాయాలతో సురేశ్ (ఇన్‌సెట్‌లో సురేశ్ ఫైల్)
ఎవరీ సురేశ్.. ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడు?
రైతు సురేశ్ అబ్దుల్లాపూర్‌మెట్ బాచారం గ్రామస్తుడు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేశ్ కుటంబం సహా గౌరెల్లికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్‌కు చెందినది. ఆయన 1980 తరువాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1–బీ కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) ఇచ్చారు. పట్టా పాసుపుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి వేరే వాళ్ల పేరిట పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారని సురేశ్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేశ్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయారెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు.
మా వాడు అమాయకుడు
నా కొడుకు అమాయకుడు. ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలం వ్యవసాయం చేశాడు, ఇప్పుడు ఆటో, రియల్ ఎస్టేట్‌తోపాటు పొలం చూసుకుంటున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు మనస్వి (7), శ్రీచరణ్ (5) ఉన్నారు. వాడికేమైనా అయితే నా గతి, నా మనవల గతి ఏంగాను? – కూర పద్మ, సురేశ్ తల్లి
మతిస్థిమితం సరిగా లేదు..
చిన్నప్పటి నుంచి సురేశ్ ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాలేదు. ఈ వివాదంపై సురేశ్ తండ్రి ఇప్పటికే పోరాడుతున్నాడు. సంబంధం లేని విషయంలో సురేశ్ తలదూర్చాడు. – కూర దుర్గయ్య, సురేశ్ పెదనాన్న
Comments
Please login to add a commentAdd a comment